CM Revanth Reddy: శ్రీశైలానికి మార్చడంతోనే..
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:51 AM
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్‌ఎస్ చేసిన అన్యాయాన్ని ఆధారాలతో సహా ఎండగట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు..
‘పాలమూరు’ ఆలస్యానికి ఇదే కారణం
జూరాల నుంచి చేపట్టి ఉంటే ఇప్పటికే పూర్తయ్యేది
సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్‌ఎస్ చేసిన అన్యాయాన్ని ఆధారాలతో సహా ఎండగట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జూరాల జలాశయం నుంచి చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చడం వల్లే సమస్యలు తలెత్తాయన్నారు. 2013లో జూరాల రిజర్వాయర్ నుంచి ఈ పథకాన్ని ప్రతిపాదించారని గుర్తుచేశారు. ఈ జలాశయం పూర్తిగా తెలంగాణ అధీనంలోనే ఉండడం వల్ల పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎలాంటి సమస్యలూ వచ్చేవి కాదని.. కృష్ణా నుంచి వచ్చే జలాలను వచ్చిన వాటిని వచ్చినట్లే తరలించుకునే అవకాశం ఉండేదని చెప్పారు. ఆదివారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణా జలాలపై ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడమేగాక.. కాళేశ్వరం ఎత్తిపోతలపై పెట్టినంత శ్రద్ధ దీనిపై పెట్టకపోవడం వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదని సీఎం రేవంత్ చెప్పారు. శ్రీశైలం ఉమ్మడి జలాశయం కావడంతో ఏపీ సమస్యలు సృష్టిస్తోందన్నారు. జూరాల నుంచి చేపట్టి ఉంటే.. ఈ పాటికే నిర్మాణం పూర్తయ్యేదని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం కూడా భారీగా పెరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014కు ముందు చేపట్టిన/ నిర్మాణంలో ఉన్న/ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు రక్షణ ఉండేదని, శ్రీశైలం నుంచి ప్రాజెక్టును చేపట్టడం వల్ల చట్టప్రకారం రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి పథకానికి కేటాయించిన 90 టీఎంసీల్లో తొలి దశలో 45 టీఎంసీలతో ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదించాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామని, ట్రైబ్యునల్ విచారణ ఏడాదిలోపే పూర్తికానందున.. ఆ కేటాయింపులతో కలిపి 90 టీఎంసీలతో రెండోదశను పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయాలనే/పూర్తి కావాలనే ఉద్దేశాలు బీఆర్‌ఎ్‌సకు లేవని, అందుకే ప్రాజెక్టును ఇబ్బంది పెట్టే నిర్ణయాలను అమలు చేస్తోందని ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్లపాటు అధికారంలో ఉండి కూడా కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయకపోయారని ప్రశ్నించారు. 2014లో పెండింగ్‌లో ఉన్న రాజీవ్ బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌కొండ ఎత్తిపోతల పథకాలు.. 2023లో అధికారంలో దిగిపోయే దాకా పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు హెడ్ వర్క్‌లు పూర్తిచేయడంలో చూపించిన శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డి; ఇతర ప్రాజెక్టులపై చూపించలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ చేసిన ద్రోహం వల్లే కృష్ణాలో పూర్తిస్థాయిలో నీటి వినియోగం జరగలేదన్నారు. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించడానికి, వారు చేపట్టిన అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్ సహకారం ఉందని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల కన్నా ముందే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ అక్రమాలను ఎండగట్టి, ప్రాజెక్టు నిర్మాణంలో ముందుకెళ్లకుండా కట్టడి చేయాల్సి ఉండగా.. బీఆర్‌ఎస్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించిందని ఆక్షేపించారు.
1న సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్
జనవరి 1న కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్ చేసిన ద్రోహంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, చొరవ ఆధారంగా సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించి.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కాపీలను తెలుగుతో పాటు ఆంగ్లంలో రూపొందించాలని నిర్దేశించారు.