Share News

CM Revanth Reddy: ధరణి వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:36 AM

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపునకు ఎన్నో కారణాలు ఉండొచ్చని, కానీ.. బీఆర్‌ఎస్‌ ఓటమికి మాత్రం ధరణి చట్టమే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు...

CM Revanth Reddy: ధరణి వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి

  • రాష్ట్రం అభివృద్ధి కావాలంటే రైతు రాజు కావాలి : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపునకు ఎన్నో కారణాలు ఉండొచ్చని, కానీ.. బీఆర్‌ఎస్‌ ఓటమికి మాత్రం ధరణి చట్టమే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హ యాంలో తెచ్చిన ధరణి చట్టం కొద్దిమంది దొరలకు చుట్టంగా మారిందన్నారు. ఆ చట్టం కారణంగా ఒక ఎమ్మార్వోను తగలబెట్టడంతోపాటు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైందని పేర్కొన్నారు. ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకుని భూ దోపిడీ చేయాలనుకున్న దొరలకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ లు గుణపాఠం చెప్పారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ధరణి నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని చెప్పానని, అన్నట్టుగానే ధరణిని వదిలించి.. ప్రజలకు చుట్టం లాంటి ‘భూ భారతి’ చట్టాన్ని తెచ్చామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన.. శిక్షణ పొంది న సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. తెలంగాణను దేశ ముఖచిత్రంపై అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, దేశంలోనే మొదటిస్థానంలో ఉండేలా చేయాలన్నదే తన ప్రయత్నమని చెప్పారు. ఇందుకోసమే ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌ డాక్యుమెంట్‌ను తీసుకువస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ నుంచి 5శాతాన్ని ఇస్తున్నామని, 2047 నాటికి దీనిని 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలని, అన్నదాతల సమస్యలు పరిష్కారమై రైతు రాజు కావాలని అన్నారు. ఇది జరగాలంటే సర్వేయర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. రైతులకు అన్యాయం చేయాలనుకుంటే సొంత కుటుంబాలకు అన్యాయం చేసినట్టేనని ఆయన అన్నారు.

దందాలకు అడ్డాగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌..

తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు-నిధులు-నియామకాలు అని చెప్పిన బీఆర్‌ఎస్‌.. అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలను పరిష్కరించలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌, నిజామాబాద్‌లో వారి కుటుంబసభ్యులు ఓడిపోయినా వెంటనే ఉద్యోగాలిచ్చారు తప్ప.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని విమర్శించారు. చివరికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ క మిషన్‌ దందాలకు అడ్డాగా మారిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, నూతన చైర్మన్‌, సభ్యులను నియమించామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే దాదాపు 60 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. ఆ తరువాత 562 గ్రూప్‌-1 పో స్టులు, 783 గ్రూప్‌-2 పోస్టులకు పరీక్షలు నిర్వహించడమే కాకుండా నియామక పత్రాలు కూడా అందించామని తెలిపారు. ఈ పరీక్షల విషయంలో కొంతమంది కేసులు వేశారని, అయినా కోర్టుల్లో కొట్లాడి అన్నింటిని పరిష్కరించుకున్నామని గుర్తుచేశారు. ఆ కారణంగానే 2011 తరువాత మళ్లీ ఇప్పుడు 2025లోనే గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించామన్నారు. త్వరలోనే గ్రూప్‌-3, గ్రూప్‌-4 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి కూడా నియామకపత్రాలు అందించనున్నట్లు తెలిపారు. తాజాగా 3,456 మంది సర్వేయర్లుకు లైసెన్సులు ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తున్నామని ఆయన చెప్పారు.


ఏళ్లు గడుస్తున్నా లభించని పరిష్కారం..

భూ యజమానులు, సర్వే చట్టం 1873లో వచ్చిందని, అయినా ఇంకా భూముల సమస్యలు పరిష్కారం కాలేదని సీఎం రేవంత్‌ అన్నారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే సర్వేయర్లకు లైసెన్సులు ఇస్తున్నట్లు తెలిపారు. భూముల సరిహద్దులను నిర్ణయించే అధికారాన్ని సర్వేయర్ల చేతుల్లో పెడుతోందన్నారు. ఈ ప్రక్రియ లో ఎవరైనా తప్పులు చేస్తే అది అందరికీ నష్టమని, ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడు తూ.. సర్వేయర్‌ లైసెన్సుల కోసం దాదాపు 10 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 7వేల మందికి శిక్షణ ఇచ్చి పరీక్ష నిర్వహించగా 3,456 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. వారందరికీ లైసెన్సులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. రైతులకు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వే చేయాలని లైసెన్సులు తీసుకున్న సర్వేయర్లకు సూచించారు. కాగా, లైసెన్సులు తీసుకున్న సర్వేయర్లు తమకు జీతాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఒకరిద్దరు ఫ్లకార్డులను ప్రదర్శించారు. అయితే దీనిపై అధికారులు ఎవరూ ఎలాంటి సమాధానం చెప్పలేదు.

Updated Date - Oct 20 , 2025 | 04:36 AM