Share News

CM Revanth Reddy : లెక్క తప్పంటే నష్టం బీసీలకే

ABN , Publish Date - Mar 19 , 2025 | 05:19 AM

బీసీ జనాభా లెక్కే లేని చోట.. ఈ జనాభా 56.36 శాతంగా ఉందని లెక్క తేల్చినం. రేపు ఏ పరీక్షకైనా నిలబడేలా కులగణన సర్వే నివేదిక రూపొందించినం.

CM Revanth Reddy : లెక్క  తప్పంటే  నష్టం బీసీలకే

  • ఏమీ లేని చోట బీసీ జనాభా 56.36 శాతమని తేల్చాం

  • 42 శాతం రిజర్వేషన్‌ కోసం ఢిల్లీలో కొట్లాడండి

  • మీ వెంట మేమున్నాం.. బీసీలకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది

  • చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్లు పెంచుకోలేము

  • కులం ముసుగులో రాజకీయాలు చేసే వారి వలలో పడకండి

  • అభినందన సభ పెట్టండి.. రాహుల్‌ గాంధీని పిలుస్తాం

  • బీసీ సంఘాలతో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

  • తెలంగాణలో బీసీ రిజర్వేషన్‌ బిల్లు విప్లవాత్మకం

  • కులగణనకు దేశానికే మార్గం చూపిన తెలంగాణ

  • కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ

హైదరాబాద్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ‘బీసీ జనాభా లెక్కే లేని చోట.. ఈ జనాభా 56.36 శాతంగా ఉందని లెక్క తేల్చినం. రేపు ఏ పరీక్షకైనా నిలబడేలా కులగణన సర్వే నివేదిక రూపొందించినం. భవిష్యత్తులో అవసరమైతే దీనికి సవరణలూ చేయొచ్చు. కానీ ఈ లెక్కే తప్పు అంటే నష్టపోయేది బీసీలే. చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్లను పెంచుకోలేం. బీసీ రిజర్వేషన్‌తోపాటు జనగణనలో కులగణనను చేర్చాలని బీసీలు ఢిల్లీలో కొట్లాడితే కాంగ్రెస్‌ మద్దతుగా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చేసిన రెండు బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో అసెంబ్లీ కమిటీహాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బీసీ సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని మంగళవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, కొండా సురేఖ, కాంగ్రెస్‌ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ వి.హన్మంతరావు బీసీ సంఘాల ప్రతినిధులు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, దాసు సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ఈ అభినందనలను మూటకట్టుకుని తీసుకెళ్లి రాహుల్‌గాంధీకి ఇచ్చే బాధ్యత తనదన్నారు. వాస్తవానికి 2011లో కులగణన ఆలోచన చేసిన రాహుల్‌ అప్పటి యూపీఏ ప్రభుత్వంతో గణన చేయించారని, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ నివేదికను దాచిపెట్టిందని అన్నారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలోనూ పాదయాత్ర చేసిన రాహుల్‌గాంధీ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే కులగణన చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే, కేంద్రంలో అధికారంలోకి రాగానే రిజర్వేషన్లపై 50 శాతంగా ఉన్న పరిమితిని ఎత్తివేసి జనాభా ప్రాతిపదికన బలహీన వర్గాలకు రిజర్వేషన్‌ పెంచుతామనీ స్పష్టం చేశారన్నారు.


చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్‌ పెరగదు

కేంద్రం పదేళ్లకొకసారి చేసే జనగణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా కులాల వారీగా గణన ఉండదన్నారు. తమ సంఖ్య ఇంత అని ఏ కులానికి ఆ కులం వారు చెప్పే లెక్కలకు చట్టబద్ధత ఉండదని తెలిపారు. చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్లు పెంచుకోలేమన్నారు. రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచుకోవాలని అనుకున్నప్పుడు చట్టబద్ధత కలిగిన లెక్కలు ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్‌ను పెంచుకోవాలంటే ముందు బీసీ జనాభా లెక్క తేలాలన్నారు. అందుకే రాహుల్‌ ఇచ్చిన హామీ మేరకు 2024 ఫిబ్రవరి 4న కులగణన సర్వే ప్రారంభించి ఏడాది తిరిగే సరికి పూర్తి చేశామని సీఎం గుర్తు చేశారు. భవిష్యత్తులో ఏ పరీక్షకైనా ఎదుర్కొని నిలిచేలా కులగణన డాక్యుమెంట్‌ను రూపొందించి అసెంబ్లీలో పెట్టామని చెప్పారు. భవిష్యత్తులో ఏ రాష్ట్రమైనా కులగణనపై సమగ్ర నివేదిక రూపొందించాలి అనుకుంటే తెలంగాణ, రేవంత్‌రెడ్డి వైపు చూడాల్సిందేనన్నారు. నాడు అంబేడ్కర్‌కు రాజ్యాంగాన్ని రాసే అవకాశం ఇచ్చినట్లుగానే కులగణన సర్వే నిర్వహించే బాధ్యతను తనతోపాటు మంత్రులు, ఉత్తమ్‌, పొన్నం ప్రభాకర్‌ తదితరులకు కాంగ్రెస్‌ ఇచ్చిందని చెప్పారు. ఈ నివేదికను బీసీ సోదరులు తప్పు పడితే.. వారికి వారే నష్టం చేసుకున్నట్లు అన్నారు. కేంద్రం చేపట్టనున్న జనగణనలో కులగణననూ చేరిస్తే.. దేశం మొత్తం బీసీ జనాభా ఎంత ఉందో పక్కాగా తేలిపోతుందని సీఎం పేర్కొన్నారు. తొలి విడత కులగణన సర్వేలో బీసీ జనాభా 56.33 శాతంగా తేలితే.. రెండో విడత సర్వే తర్వాత అది 56.36 శాతానికి పెరిగిందన్నారు. మండల్‌ కమిషన్‌.. బీసీ జనాభా 52 శాతంగా అంచనా వేస్తే.. 56.36 శాతమని తాము లెక్క తేల్చి చెప్పానన్నారు. ‘‘ దాచిపెట్టి చేయాల్సిన అవసరం మాకు లేదు. వాయిదాలే వేయాలనుకుంటే పదేళ్లు కూడా తెగని చిక్కుముడులు వేయవచ్చు. కానీ పది నెలల్లోనే ఎందుకు లెక్కలు తేల్చిన? కులగణన లెక్కలు తేల్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలనుకున్నాం. ఇందులో నాకు, ఉత్తమ్‌కు స్వలాభం ఏముంది?’’ అని సీఎం ప్రశ్నించారు. బీసీలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్‌ ఆలోచనని స్పష్టం చేశారు.


రేపు రిజర్వేషన్లు 56 శాతానికీ పెరగొచ్చు

ఏమీ లేనప్పుడు బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చిందని, ఆ తర్వాత అది 26 శాతానికి.. 29 శాతానికి ఇప్పుడు 42 శాతానికి చేరిందని, భవిష్యత్తులో 56 శాతానికీ చేరవచ్చునని సీఎం అన్నారు. పరిణామ క్రమంలో వచ్చేది తీసుకుని రావాల్సింది అడగాలి తప్ప.. ఏదో అడగాలని చెప్పి వచ్చేది తీసుకోకుంటే నష్టపోతామని చెప్పారు. కులగణన సర్వే ప్రక్రియ మొత్తాన్నీ తప్పు పడితే మళ్లీ మెదటికి వస్తుందన్నారు. పరిణామ క్రమంలో రాజ్యాంగాన్ని సవరించుకున్నట్లుగా భవిష్యత్తులో కులగణన సర్వేనూ సవరించుకోవచ్చు అని చెప్పారు.


కట్టిన ఇంట్లో ఉండనంటే.. ఆ ఇల్లు శిథిలమవుతుంది

‘‘ఏడంతస్తుల మేడ కట్టుకునేంత బలమైన పునాది వేసి.. రెండంతస్తుల నిర్మాణం నేను పూర్తి చేశా. ఉన్న వ్యవస్థను వాడుకుని మిగిలిన ఐదంతస్తుల నిర్మాణం మీరు పూర్తి చేసుకోండి. లేదూ ఏడంతస్తుల నిర్మాణం పూర్తయ్యేవరకూ ఈ ఇంట్లోకి రానంటే.. ఈ లోపు కట్టింది శిథిలమైపోతుంది’’ అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చట్టబద్ధంగా తాము తేల్చిన 56.36 శాతం లెక్కను భవిష్యత్తులో పెంచుకోవడం తేలికన్నారు. కులాల ముసుగులో కొందరు రాజకీయంగా ఎదగాలని చూస్తుంటారని, అలాంటి వారి మాయలో పడకండని బీసీలకు హితవు పలికారు. కులగణన సర్వే ఆధారంగా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్‌ అడుగుతున్న బీసీలు.. భవిష్యత్తులో చట్టసభల్లోనూ 42 శాతం రిజర్వేషన్‌ కోసం కొట్లాడవచ్చన్నారు. కులగణన సర్వేని తప్పు అన్న మరుక్షణం వాదించడానికి బలం ఉండదని, ఆ వాదనతో ఫలితాలూ రావని సూచన చేశారు. అందరం కలిసి జనగణనలో కులగణన చేర్చాలని కొట్లాడితే కేంద్రం ఎందుకు చేర్చదన్నారు. రిజర్వేషన్ల పెంపుతో పాటు జనగణనలో కులగణన కూడా చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. దానికి అన్ని పార్టీలనూ ఆహ్వానించాలని, కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా ఉంటుందని ప్రకటించారు. ఇక, సూర్యాపేట లేదా పరేడ్‌ గ్రౌండ్‌లో రాహుల్‌గాంధీకి అభినందన సభ పెడితే.. తాను, టీపీసీసీ అధ్యక్షుడు కలిసి రాహుల్‌ గాంధీని ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ కులగణన సర్వేతో రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ బిల్లుల ఆమోదంతో ఒక ఘట్టం ముగిసిందని, ఢిల్లీ వెళ్లాల్సిన ఘట్టం మిగిలుందన్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ చిరంజీవులు మాట్లాడుతూ దేశంలో ఏ రిజర్వేషన్లు వచ్చినా కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లోనే వచ్చాయన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 05:21 AM