Telangana CM Revanth: తగ్గే ఆదాయాన్ని కేంద్రమే భరించాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 06:25 AM
జీఎస్టీ సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి ఏటా రూ.7 వేల కోట్ల దాకా ఆదాయం తగ్గనుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
కొత్త జీఎస్టీతో రాష్ట్రానికి ఏటా 7 వేల కోట్లు తగ్గనున్న
ఆదాయం.. మీ చావు మీరు చావండంటే కుదరదు
ఐదేళ్లపాటు వీజీఎ్‌ఫతో అంతరాన్ని భర్తీ చేయాలి
సింగరేణి లాభాల్లో కార్మికులకు 34శాతం వాటా
ఒక్కొక్కరికి రూ.1,95,610 లబ్ధి: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి ఏటా రూ.7 వేల కోట్ల దాకా ఆదాయం తగ్గనుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిని సర్దుబాటు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. జీఎస్టీని ప్రవేశపెట్టిన సమయంలో 14 శాతం ఆదాయం తొలి ఐదేళ్లలో రాకపోతే.. ఆ అంతరాన్ని తగ్గించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు. ‘‘రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఆధారంగా మేం ప్రణాళికలు వేసుకున్నాం. కానీ, కేంద్రం ఉన్న ఫలంగా ఒక నిర్ణయం తీసుకుంది. ‘మేం ప్రకటన చేస్తాం.. నిర్ణయాలు తీసుకుంటాం.. మీ చావు మీరు చావండి’ అని ప్రధానమంత్రి మోదీ అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా మంచిదికాదు. దానివల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. జీఎస్టీ సంస్కరణలతో రానున్న ఐదేళ్లలో తగ్గే ఆదాయాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్)తో కేంద్రమే భర్తీ చేయాలి’’ అని రేవంత్ అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ అంశాలను మోదీ సర్కారుకు నివేదించి న్యాయం జరిగేలా చూడాలన్నారు. సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, జి.వివేక్‌లతో కలిసి సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో 34 శాతం వాటాను బోన్‌సగా సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బొగ్గు ధరల అంశాన్ని సహేతుకంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై నాలుగు గోడల మధ్య చర్చించబోమని, కోల్‌బెల్ట్‌కు చెందిన ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలతో కలిసి బొగ్గుబావుల వద్దే చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
దీపావళికి బోన్‌సపై మరో ప్రకటన..
సింగరేణికి విద్యుత్తు సంస్థలు రూ.27 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందనే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ఇది చాలా సున్నితమైన సమస్య అన్నారు. వడ్డీల భారం తగ్గించుకోవడం, ఇతరత్రా చర్యలతో ఈ సమస్యను అధిగమిస్తామన్నారు. సింగరేణి సంస్థకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,394 కోట్ల లాభాలు వచ్చాయని, ఇందులో సంస్థ విస్తరణకు రూ.4,034 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన రూ.2,360 కోట్లలో కార్మికులకు 34 శాతం వాటాగా రూ.819 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 చొప్పున ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. గతేడాది తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ రూ.5 వేల చొప్పున బోనస్ అందజేసినట్లు, ఈసారి రూ.5,500 చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కోల్ ఇండియా నిర్ణయం అనంతరం దీపావళి బోన్‌సపై మరో ప్రకటన చేస్తామన్నారు.
కార్పొరేట్ రంగంతో పోటీ పడేలా..
కార్మికులకు లాభాల్లో వాటాలు పంచడంతోపాటు సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు, విస్తరణ కార్యక్రమాలు, కార్పొరేట్ రంగంతో పోటీపడేలా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వేలంలో పాల్గొనకపోవడం వల్ల కోల్పోయిన రెండు గనులను తిరిగి సింగరేణి అధీనంలోకి తీసుకొచ్చే విషయంలో అన్ని మార్గాలను అన్వేషిస్తామని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో గత ప్రభుత్వం పాల్గొనకపోవడం వల్ల సింగరేణి ప్రాంతంలోని రెండు గనులు ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లాయన్నారు. దాంతో సింగరేణికి నష్టం వాటిల్లిందని, ఆ బ్లాకులను తిరిగి తెచ్చుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. కాగా, సంస్థను కాపాడాలని, ఉద్యోగుల్లో పని సంస్కృతిని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో 1999-2000 సంవత్సరంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం లాభాల్లో వాటా బోన్‌సను ప్రకటించిందని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎంపీలు బలరాంనాయక్, రఘురామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాలరావు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.