CM Revanth Extend Dasara Wishes: చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:34 AM
విజయదశమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు...
ప్రజలకు సీఎం, గవర్నర్ దసరా శుభాకాంక్షలు
సొంతూరులో దసరా వేడుకల్లో పాల్గొననున్న సీఎం
హైదరాబాద్, కొడంగల్, అక్టోబరు1(ఆంధ్రజ్యోతి): విజయదశమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా సంబరాలు చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా ఈ పండుగ నిలుస్తుందని రేవంత్ తెలిపారు. మరోవైపు గురువారం ఉదయం ముఖ్యమంత్రి బాపూ ఘాట్‌ను సందర్శించి గాంధీజీకి నివాళి అర్పించనున్నారు.
సీఎం కొడంగల్ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
విజయదశమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో నిర్వహించే దసరా ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి గురువారం రాత్రి కొడంగల్‌కు బయలుదేరి తన నివాసంలో బస చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అడిషనల్ కలెక్టర్ అమరేందర్ కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.