Share News

SLBC Tunnel: నేటి నుంచి హెలికాప్టర్‌ సర్వే

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:37 AM

శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల పునరుద్థరణలో భాగంగా సోమవారం హెలికాప్టర్‌తో ‘మాగ్నెటిక్‌ జియోఫిజికల్‌...

SLBC Tunnel: నేటి నుంచి హెలికాప్టర్‌ సర్వే

  • ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల పునరుద్ధరణ కోసం నిర్వహణ

  • స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌

  • నేడు మన్నెవారిపల్లికి రేవంత్‌

హైదరాబాద్‌/నాగర్‌కర్నూల్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల పునరుద్థరణలో భాగంగా సోమవారం హెలికాప్టర్‌తో ‘మాగ్నెటిక్‌ జియోఫిజికల్‌ సర్వే’ను ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సోమవారం నాగర్‌కర్నూలు జిల్లా మన్నేవారిపల్లి చేరుకుని సర్వేను పర్యవేక్షించనున్నారు. సర్వే జరిపే హెలికాప్టర్‌కు సమాంతరంగా మరో హెలికాప్టర్‌లో సీఎం, మంత్రి ప్రయాణిస్తూ పరిశీలిస్తారు. నేషనల్‌ జియోఫిజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సర్వే హెలికాప్టర్‌ దాదాపు 200 కి.మీ. మేర ప్రయాణిస్తూ సొరంగం తవ్వాల్సిన ప్రాంతంలో భూగర్భంలో 800-1000 మీటర్ల లోతు వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో జల్లెడ పడుతుంది. గత ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలిన ఘటనలో కార్మికులు మృత్యువాత పడడంతో పాటు టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం) ముక్కలు చెక్కలైంది. దీంతో నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు అత్యంత సురక్షిత పద్ధతిలో సొరంగం తవ్వకాలను పునరుద్ధరించడానికి ఈ సర్వే నిర్వహించాలని ప్ర భుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులో భాగంగా రెండు సొరంగాల్లో రెండోదాని తవ్వకాలు పూర్తయ్యాయి. ఒకటో సొరంగాన్ని మొత్తం 43.93 కి.మీ. తవ్వాల్సి ఉండగా.. ఇన్‌లెట్‌ వైపు నుంచి 13.94 కి.మీ., అవుట్‌లెట్‌ వైపు నుంచి 20.4 కి.మీ. తవ్వకం ఇప్పటికే పూర్తయింది. మధ్యలో 9.8 కి.మీ. తవ్వాల్సి ఉంది.


సర్వే ఇలా చేస్తారు..

24 మీటర్ల వ్యాసం కలిగిన ట్రాన్స్‌మిటర్‌ లూప్‌ను హెలికాప్టర్‌కు వేలాడదీస్తారు. హెలికాప్టర్‌ సొరంగం తవ్వాల్సిన ప్రాంతంపై ఎగురుతుండగా ట్రాన్స్‌మిటర్‌ లూప్‌ ద్వారా సర్వే చేస్తారు. అది విద్యుదయస్కాంత తరంగాలను పంపిస్తుంది. అవి భూగర్భంలోని పొరలకు తాకి తిరిగొస్తాయి. వాటిని రిసీవర్‌ ద్వారా గ్రహించి.. వాటి ఆధారంగా భూగర్భంలో ఎలాంటి నిర్మాణం ఉందో అంచనా వేస్తారు. 800-1,000 మీటర్ల లోతుల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయా? నీళ్లు ఉన్నాయా? వంటి అంశాలను నిపుణులు అధ్యయనం చేస్తారు. తద్వారా సొరంగం తవ్వకాలకు ఎలాంటి టెక్నాలజీ వినియోగించాలో సిఫారసు చేస్తారు.

సీఎం పర్యటనపై ఆసక్తి

నల్లగొండ జిల్లాకు సాగు నీరందించే ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు కీలక సర్వే జరగనున్న నేపథ్యంలో నాగర్‌కర్నూలు జిల్లా నల్లమలలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ సోమవారం ఆయన ఇక్కడకు రానుండడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు ఆయన మన్నెవారిపల్లికి చేరుకోనున్నారు. అక్కడ పార్టీ అచ్చంపేట నాయకులతో సమావేశమైన తర్వాత సర్వే పరిశీలనలో పాల్గొంటారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడతారు.

Updated Date - Nov 03 , 2025 | 03:37 AM