Youth Sports: మెస్సీతో సీఎం ఫుట్‌బాల్
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:28 AM
గమెరిగిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు లయొనెల్ మెస్సీతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడా మైదానంలో తలపడనున్నారు.
స్టార్ ప్లేయర్‌తో తలపడనున్న ముఖ్యమంత్రి
13న ఉప్పల్ స్టేడియంలో విద్యార్థులతో ఆట
9వ నంబర్ జెర్సీతో మెరవనున్న రేవంత్
ఎప్పట్లాగే 10వ నంబర్ జెర్సీతో మెస్సీ
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జగమెరిగిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు లయొనెల్ మెస్సీతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడా మైదానంలో తలపడనున్నారు. ఆటలో భాగంగా ఇద్దరూ ఎదురుపడే పరిస్థితి వచ్చినపుడు ఏం జరుగుతుందా? అని రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో మ్యాచ్‌కు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. డిసెంబరు8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. సదస్సు ముగింపును పురస్కరించుకుని డిసెంబరు 13న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఫుట్‌బాల్ డ్రీమ్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వస్తున్న మెస్సీ ఉప్పల్ స్టేడియంలో ప్రభుత్వ పాఠశాలల పిల్లలతో ఫుట్‌బాల్ ఆడతారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్-9 టీమ్ తరపున ముఖ్యమంత్రి ఆడతారు. ఎల్‌ఎం-10 టీమ్ తరపున మెస్సీ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో రేవంత్‌రెడ్డి 9వ నెంబర్ జెర్సీ ధరిస్తారు. ప్రత్యర్థి జట్టులో ఉన్న మెస్సీ ఎప్పట్లాగే తన క్రేజీ పదో నంబర్ జెర్సీ ధరిస్తారు. ఒక ముఖ్యమంత్రి, ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారుడు ఫుట్‌బాల్ మైదానంలో తలపడుతున్నారనే వార్త రాజకీయ నాయకుల్లోనూ ఆసక్తిని రేపుతోంది.
రేవంత్‌ను కలిసిన శుభలేఖ సుధాకర్
నటుడు శుభలేఖ సుధాకర్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. రవీంధ్రభారతి ఆవరణలో డిసెంబర్ 15న ప్రముఖ సినీ నేపఽథ్య గాయకుడు దివంగత ఎస్‌పి.బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. రవీంద్రభారతి ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించినందుకు బాలసుబ్రమణ్యం కుటుంబం తరపున ముఖ్యమంత్రికి సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు.