Share News

CM Revanth: 150 మీటర్లతో తుమ్మిడిహెట్టి!

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:32 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం..

CM Revanth: 150 మీటర్లతో తుమ్మిడిహెట్టి!

  • మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలన్న సీఎం రేవంత్‌

  • బ్యారేజీతో ముంపు, నీటి లభ్యతపై అధికారుల కసరత్తు

  • 1500 ఎకరాలకు గరిష్ఠ పరిహారం చెల్లించే యోచన

  • 80 టీఎంసీలతో ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్‌ రూపకల్పన!

  • తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపునకు..

  • ప్రభుత్వ పరిశీలనలో రెండు ప్రతిపాదనలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. దీనిని 150 మీటర్ల ఎత్తుతో చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీ్‌సను కలిసి సంప్రదింపులు జరపాలని సూచించారు. అయితే మహారాష్ట్ర గతంలో 148 మీటర్లతో బ్యారేజీ నిర్మాణానికి సమ్మతి తెలిపింది. కానీ, దీనివల్ల ప్రయోజనం లేదని, 150 మీటర్లతో కట్టడానికి వీలుగా ఆ రాష్ట్రాన్ని ఒప్పించాలని సీఎం అన్నారు. 148, 150, 152 మీటర్ల వద్ద ముంపుపై పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) ఇప్పటికే అధ్యయనాలు కూడా చేసింది. 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించినా, 150 మీటర్ల ఎత్తుతో నిర్మించినా పెద్దగా ముంపు ఉండబోదని అధ్యయనాలు చెబుతున్నాయి. 148 మీటర్లతో నిర్మిస్తే... ముంపు 300 ఎకరాల్లోపు ఉంటుందని, 150 మీటర్లతోనైతే 1500 ఎకరాల్లోపు, 152 మీటర్లతో 4 వేల ఎకరాల్లోపు ముంపు ఉంటుందని పేర్కొంటున్నాయి. అయితే 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుందని, అంతకన్నా తక్కువ ఎత్తుతో కడితే ఉపయోగం ఉండదని నీటిపారుదల రంగ నిపుణులు చెప్పడంతో 1500 ఎకరాలకు గరిష్ఠ పరిహారం చెల్లించడానికి వీలుగా కసరత్తు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం.

ఎకరానికి రూ.25 లక్షల పరిహారం..

ముంపు ప్రాంతాల్లోని భూమి ధర ఎకరానికి రూ.5 లక్షల లోపే ఉన్నప్పటికీ.. రూ.25 లక్షల దాకా పరిహారం చెల్లించి భూములను సేకరించడానికి సమ్మతి తెలపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రక్రియ కోసం సాంకేతిక సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించి ఈ నెలాఖరులోగా మహారాష్ట్ర సీఎంతోపాటు అధికారులను క లిసే బాధ్యతను ప్రభుత్వం నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దా్‌సకు అప్పగించింది. వాస్తవానికి 2016 మార్చి 8న తుమ్మిడిహెట్టిని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మహారాష్ట్ర సీఎం, తెలంగాణ సీఎంల మధ్య ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కోసం కూడా ఒప్పందం చేసుకున్నారు. అయితే తుమ్మిడిహెట్టితోపాటే మేడిగడ్డ కూడా కడతామని అప్పట్లో ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తరువాత తుమ్మిడిహెట్టిన పక్కన పెట్టింది. తాజాగా ఆరు నూరైనా తుమ్మిడిహెట్టి కడతామని సీఎం రేవంత్‌ ప్రకటించారు. ఇటీవల నీటిపారుదల శాఖపై సమీక్ష సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 150 మీటర్లతో బ్యారేజీ కట్టడానికి వీలుగా తగిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


కాళేశ్వరం డీపీఆర్‌ను ముట్టుకోకుండా..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ముట్టుకోకుండా తుమ్మిడి హెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 80 టీఎంసీలతో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీని 2.75 టీఎంసీల సామర్థ్యంతో కట్టనున్నారు. 150 మీటర్లతో దీనిని నిర్మిస్తే 60 టీఎంసీల దాకా నీటిని గ్రావిటీ ద్వారా తరలించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి... నీటిని తరలించడానికి ప్రస్తుతం రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది.. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీటిని తరలించి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి పంపింగ్‌ చేసుకోవడం. కాగా, రెండోది.. తుమ్మిడిహెట్టి నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీటిని తరలించడం. దీనికోసం ఇప్పటికే 71.5 కిలోమీటర్ల వరకు (ఎల్లంపల్లి సమీపంలోని మైలారం గ్రామం దాకా) గ్రావిటీ కాలువ నిర్మాణం ఇదివరకే పూర్తయింది. మైలారం గ్రామం వద్ద పంప్‌హౌస్‌ నిర్మించి, అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి పంపింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి డ్యామ్‌ 116 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అందులో 71.5 కిలోమీటర్ల వరకు గ్రావిటీ కాలువ పనులు కూడా పూర్తయ్యాయి. అయితే తుమ్మిడిహెట్టిని 150 మీటర్లతో కడితే... గ్రావిటీ ద్వారా మైలారం గ్రామం దాకా నీళ్లు వస్తాయి. ఒకవేళ సుందిళ్ల బ్యారేజీకి తరలించాల్సి వస్తే అక్కడి నీరు గ్రావిటీతో చేరుతుంది. సుందిళ్లలో ప్రస్తుతం సీపేజీలు ఉండగా... వాటికి మరమ్మతులు చేయాల్సి ఉంది. అదే ఎల్లంపల్లికి నేరుగా నీటిని తరలించాలంటే మైలారం వద్ద కొత్తగా పంప్‌హౌస్‌ ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. దాంతో ఏ ప్రతిపాదనకు ప్రభుత్వం మొగ్గుచూపుతుందో డీపీఆర్‌ సిద్ధమయ్యాకే తేలనుంది.

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ...!

కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్‌-1లో సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలతో పాటు మూడు పంప్‌హౌ్‌సలు ఉన్నాయి. వీటికి రూ.27,637 కోట్ల దాకా వెచ్చించారు. మేడిగడ్డ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా... అన్నారం సామర్థ్యం 10.87 టీఎంసీలు, సుందిళ్ల సామర్థ్యం 8.83 టీఎంసీలు. ప్రస్తుతం బ్యారేజీల్లో సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ (పుణె) అధ్యయనాలు చేస్తోంది. వరదలు తగ్గుముఖం పట్టాక పరీక్షలన్నీ పూర్తికానున్నాయి. ఆ తర్వాత ఆ నివేదికల ఆధారంగా పునరుద్ధరణ కోసం డిజైన్లు సిద్ధం చేయనున్నారు. బ్యారేజీల పునరుద్ధరణ అనంతరం నీటి నిల్వను గణనీయంగా తగ్గించుకొని.. కేవలం పంపింగ్‌కు అనుకూలత (పంపుల హెడ్‌కు నీరు తగిలేంత) వరకు నిల్వ చేసుకొని, నీటిని పంపింగ్‌ చేసుకోవడానికి అత్యవసర పరిస్థితుల్లోనే దీనిని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.


కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యంతో తుమ్మిడిహెట్టికి లైన్‌ క్లియర్‌

తాజాగా కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీకి రూట్‌ క్లియర్‌ అయింది. 2023 అక్టోబరు 21న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి చెందిన ఏడో బ్లాకు(11 పిల్లర్లు) కుంగింది. ఒక పిల్లరు విరిగింది కూడా. ఆ తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీగా సీపేజీలు బయటపడ్డాయి. దీనిపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. అయితే బ్యారేజీల పునరుద్ధరణ కోసం భూభౌతిక/భూసాంకేతిక పరీక్షలు చేసి, పునరుద్ధరణ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసి, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం కూడా తీసుకోవాలని సిఫారసు చేసింది. కానీ, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ అంత తేలికేమీ కాదని, 11 పిల్లర్లు ఉన్న ఏడో బ్లాకును తొలగించడం, ఇతర బ్లాకుల్లో లోపాలను సరిచేయడం వంటి వాటికి అయ్యే వ్యయంతో కొత్తగా బ్యారేజీ కట్టవచ్చని పలువురు సూచిస్తున్నారు. మేడిగడ్డను పునరుద్ధరించేలోపే.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కట్టాలని గుర్తుచేయడంతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Updated Date - Sep 16 , 2025 | 05:32 AM