CM Relief Fund Check Scam: సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల్ని బొక్కారు!
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:03 AM
ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్‌ఎఫ్ పథకం చెక్కులను కాజేసి సొమ్ము చేసుకున్న ఎనిమిదిమందిని సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు పోలీసులు అరెస్టు చేశారు....
సూర్యాపేట జిల్లాలో ఎనిమిది మంది అరెస్టు
సూర్యాపేటక్రైం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) పథకం చెక్కులను కాజేసి సొమ్ము చేసుకున్న ఎనిమిదిమందిని సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి రూ.7.3 లక్షల నగదు, వినియోగించని 44 చెక్కులు, ఆరు బ్యాంక్ పాస్‌పుస్తకాలు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కొత్తపల్లి నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెర్వుకు చెందిన ఒక వ్యక్తి 2023లో అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తర్వాత సీఎంఆర్‌ఎఫ్ కోసం అప్పటి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ద్వారా దరఖాస్తు చేశాడు. నెలలు గడుస్తున్నా తనకు సాయం అందకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లి విచారించగా.. అతడి పేరిట చెక్కు విడుదలైందని, దాన్ని ఎవరో సొమ్ము చేసుకున్నారని తెలిసింది. చెక్కును ఎన్‌క్యాష్ చేసుకున్నవారి వివరాలు తెలుసుకున్న ఆ వ్యక్తి.. వారి వద్దకు వెళ్లి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. సైదిరెడ్డి క్యాంపు కార్యాలయంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసే పులిదిండి ఓంకార్, కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే పెండెం వెంకటేశ్వర్లు దీని వెనుక ఉన్నట్టు వెల్లడైంది.
ఇలా సొమ్ము చేసుకున్నారు..
ఓంకార్, వెంకటేశ్వర్లు కలిసి.. 2023లో సైదిరెడ్డి ద్వారా సీఎంఆర్‌ఎ్‌ఫకు దరఖాస్తు చేసుకున్నవారికి వచ్చిన 51 చెక్కులను వారి వద్దే దాచుకున్నారు. బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మాదాసు వెంకటేశ్వర్లు, బెల్లంకొండ పద్మ, మట్టపల్లి సైదులు, బెల్లంకొండ సైదులు, గొట్టెముక్కల వెంకటేశ్వర్లు అనే వ్యక్తులతో కలిసి...సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఎవరి పేరిట విడుదలయ్యాయో అవే పేర్లు ఉన్న వ్యక్తులను గాలించి.. వారి బ్యాంకు ఖాతాల్లో ఆ చెక్కులు జమ చేయించారు. వచ్చిన సొమ్మంతా తాము పంచుకుని.. ఆ ఖాతాదారుడికి రూ.5 వేల నుంచి 10 వేల దాకా ఇచ్చారు. ఇలా ఏడు చెక్కులను మార్చి 9.5 లక్షలు కాజేశారు. కానీ, సీఎంఆర్‌ఎ్‌ఫకు దరఖాస్తు చేసుకున్నవారిలో ఒకరు ఆరా తీయడంతో వీరి గుట్టు బయటపడింది. అక్కణ్నుంచీ ఆ వ్యక్తి నేరుగా వీరి వద్దకు వెళ్లి నిలదీయడంతో.. తాము కాజేసిన సొమ్ములోంచి అతడికి రూ.2.25 లక్షలు ఇచ్చారు. వారిపై బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు మేళ్లచెర్వు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తొలుత వారు బెల్లంకొండ వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని సోమవారం మిగతా నిందితులను అరెస్ట్ చేశారు.