GHMC Expansion: క్లస్టర్ల మ్యాపింగ్!
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:56 AM
ఓఆర్‌ఆర్ లోపల, బయట ఉన్న 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందులోభాగంగానే శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని ప్రాంతాలను క్లస్టర్లుగా విభజిస్తున్నట్లు తెలిసింది....
జీహెచ్‌ఎంసీలో ఇతర కార్పొరేషన్ల విలీనంపై కొనసాగుతున్న కసరత్తు’8 జనాభా, ఓటర్ల ఆధారంగా ప్రక్రియ
రెండు క్లస్టర్లు కలిపితే.. ఒక డివిజన్
ఒక్కో డివిజన్‌లో 40-50 వేల జనాభా
250-300 డివిజన్ల ఏర్పాటుకు యోచన
ముసాయిదా దస్త్రానికి గవర్నర్ ఆమోదం?
త్వరలోనే గెజిట్ జారీ చేయనున్న సర్కార్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఓఆర్‌ఆర్ లోపల, బయట ఉన్న 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందులోభాగంగానే శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని ప్రాంతాలను క్లస్టర్లుగా విభజిస్తున్నట్లు తెలిసింది. తద్వారా విలీనం తర్వాత డివిజన్ల పునర్విభజన సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో వారం రోజులుగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), బల్దియా పట్టణ ప్రణాళిక, ఎన్నికల విభాగాలు, ప్రతిపాదిత విలీన కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని టౌన్‌ప్లానింగ్ అధికారులు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. రోజు వారీ సాధారణ పనులు పక్కనపెట్టి.. ఉదయం నుంచి రాత్రి వరకు విలీన ప్రక్రియపై కుస్తీ పడుతున్నారు. జీహెచ్‌ఎంసీతోపాటు ప్రతిపాదిత విలీన కార్పొరేషన్లు, మునిసిపాలిటీ మ్యాపుల ఆధారంగా క్లస్టర్లను గుర్తిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఒకటి లేదా రెండు క్లస్టర్లను ఒక డివిజన్‌గా ఏర్పాటు చేసే సూచనలున్నాయని చెబుతున్నారు. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా ప్రస్తుతం క్లస్టర్ల విభజన జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల నిర్ణీత స్థాయిలో జనాభా ఉండడం లేదు. ఇలాంటి క్లస్టర్లను పక్కనున్న మునిసిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలతో కలిపే అవకాశం ఉంది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 1.30 కోట్లకుపైగా జనాభా ఉన్నట్లు అంచనాలున్నాయి. ప్రతిపాదిత విలీన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 30 నుంచి 40 లక్షల జనాభా ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో 40-50 వేల జనాభాకు ఒక డివిజన్‌ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా భావిస్తున్నారు. ఆయా డివిజన్లకు సహజ సరిహద్దులు కీలకంగా మారనున్నాయని, నదులు, జాతీయ రహదారులు, చెరువులు తదితరాలు హద్దులుగా ఉంటాయని ఓ అధికారి చెప్పారు. డివిజన్ల జనాభాలో 10 శాతం హెచ్చుతగ్గులు ఉంటాయని, 250-300 డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం పలు డివిజన్లు రెండు అంతకంటే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నా యి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కో డివిజన్.. ఒకే అసెంబ్లీ నియోజకవర్గం, ఒకే జిల్లా పరిధిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 69 లక్షల జనాభా మాత్రమే ఉంది. అప్పటి జనాభాతో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. శివారు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ మేరకు అప్పటి జనాభాతోపాటు ప్రస్తుత ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటూ మధ్యే మార్గంగా డివిజన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. బడంగ్‌పేటను మూడు, మీర్‌పేటను రెండు క్లస్టర్లుగా విభజించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ముసాయిదాపై గవర్నర్ సంతకం!
జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రతిపాదనను ఇప్పటికే మంత్రివర్గం ఆమోదించగా.. ఆ తర్వాత బల్దియా కౌన్సిల్ సైతం అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా విలీన ప్రక్రియకు సంబంధించిన ముసాయిదా దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేసినట్లు తెలిసింది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గెజిట్ విడుదల తర్వాతే విలీన ప్రక్రియ ఎలా ఉంటుంది? పాలనా సౌలభ్యం కోసం ఏం చేయనున్నారు? వంటి అంశాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి.