Jubilee Hills Amid Polling: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల బాహాబాహీ
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:52 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. బోరబండ, షేక్‌పేట, ఎర్రగడ్డల, యూస్‌ఫగూడ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి.....
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
యూసు్‌ఫగూడలో తీవ్ర ఉద్రిక్తత, భారీగా ట్రాఫిక్ జామ్
షేక్‌పేటలో ఎదురుపడ్డ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు.. ఘర్షణ
హైదరాబాద్ సిటీ, బంజారాహిల్స్, కార్వాన్, యూసు్‌ఫగూడ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. బోరబండ, షేక్‌పేట, ఎర్రగడ్డల, యూస్‌ఫగూడ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. పోలీసులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. మంగళవారం సాయంత్రం మరో అరగంటలో పోలింగ్ ముగస్తుందనగా.. కొంత మంది ప్రైవేటు వ్యక్తులు దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమై, యూసు్‌ఫగూడలో మొహమూద్ ఫంక్షన్ హాల్‌లో ఉన్నారనే సమాచారం రావడంతో బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. అయితే తామంతా కళాకారులమని ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం ప్రచారం చేశామని.. తమకు అక్కడ భోజనం, వసతి ఏర్పాట్లు చేశారని అక్కడున్నవారు తెలిపారు. అయితే.. వారు ఓటు వేశారేమోనన్న అనుమానంతో బీఆర్‌ఎస్ నేతలు వారి వేళ్లను పరిశీలించారు. విషయం తెలిసి.. ఆ ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తున్న అదనపు పోలీసు కమిషనర్ జోయల్ డేవిడ్ తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిలను బలవంతంగా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పంపిచేశారు. ఈ క్రమంలో సుదర్శన్‌రెడ్డికి గాయాలయ్యాయి. దీంతో మాగంటి సునీత, ఆమె కుటుంబ సభ్యులు ఫంక్షన్ హాల్ వద్ద బైఠాయించారు. కాంగ్రె్‌సకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు, కళాకారులు సైతం బైఠాయించి బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫంక్షన్‌హాల్‌ను పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకునేందుకు ఎన్నికల అధికారి అనుమతి కూడా ఉందంటూ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు పత్రాలు చూపించారు. దీంతో పోలీసులు సునీతతో పాటు మిగతా వారిని బయటకు పంపించారు. వారు యూసు్‌ఫగూడ చౌరస్తా వైపు వెళుతుండగా కాంగ్రెస్ కార్యాలయం వద్ద నవీన్‌యాదవ్‌కు చెందిన కొందరు మనుషులు అసభ్య పదజాలంతో మాట్లాడారు. దీంతో మాగంటి సునీత.. ‘ఇదేం రౌడీయిజం?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. విషయం తెలిసి.. నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్ కార్యకర్తలతో సహా కాంగ్రెస్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిన్న శ్రీశైలంయాదవ్‌ను పోలీసులు ఇంటికి పంపించేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఓటర్లను భయపెడుతున్నారు: సునీత
పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచిందని.. ఓటర్లను భయపెట్టిందని బీఆర్‌ఎస్ అభ్యర్ధి సునీత ఆరోపించారు. నవీన్‌యాదవ్ అనుచరుడు సురే్‌షయాదవ్ తన వైపు వేలు చూపిస్తూ.. ‘నీ అంతు చూస్తాం’ అని బెదిరించాడని.. 14వ తేదీ తర్వాత అందరి పనీ చెప్తామంటూ హెచ్చరించాడని ఆరోపించారు. వందల మంది ప్రైవేటు సైన్యాన్ని దింపి దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీ పొట్లాలలో డబ్బు పెట్టి ఇస్తున్నారని, నవీన్‌యాదవ్ సోదరుడు వెంకట్ స్వయంగా డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. మరోవైపు.. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శ్రావణ్‌కుమార్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు.. కాంగ్రెస్ నాయకులు షేక్‌పేట డివిజన్‌లోని అపెక్స్ హైస్కూల్ పోలింగ్ స్టేషన్ వద్ద ఎదురు పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు, కేంద్రబలగాలు లాఠీచార్జ్ చేసి వారిని అక్కణ్నుంచీ తరిమివేశారు. పోలింగ్ సమయం ముగుస్తుండడంతో ఇరువర్గాలకు చెందిన టేబుళ్లను కూడా తొలగించారు. కాగా.. మంగళవారం సాయంత్రం వరకు పోలింగ్ మందకొడిగా సాగుతుండడంతో ఎంఐఎం నాయకులు ఇంటింటికీవెళ్లి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ పెద్దఎత్తున జనాలను తీసుకురావడంతో బూత్‌ల వద్ద హడావుడి నెలకొంది. దీంతో రిగ్గింగ్ జరిగిందంటూ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి రిగ్గింగ్ జరగలేదని.. పోలింగ్ బూత్‌లకు జనం ఒక్కసారిగా రావడంతో హడావుడి నెలకొందని మజ్లిస్ నేతలు తెలిపారు.

పలువురిపై కేసులు..
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ఓటర్లను ప్రభావితం చేశారనే ఆరోపణలతో మధురానగర్, బోరబండ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓటింగ్ రోజు ప్రచారం చేయడంతో వైరా ఎమ్మెల్యే రాందా్‌సపై మధురానగర్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు నిబంధనలకువిరుద్ధంగా ప్రచారం చేయడంతో పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బైక్‌లపై తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నాడని ఏఆర్‌వో అజారుద్దీన్ చేసిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు నవీన్ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, వద్దిరాజు రవి చంద్ర, పాడి కౌశిక్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి తదితరులు మహమూద్ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డుపై కూర్చొని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్‌లు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రచారం చేస్తున్నారంటూ దినకరపాల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. కాగా.. తమ పార్టీ నాయకులు పాపారావు, అనంతకృష్ణలను పంజగుట్ట పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, వారి ఫోన్లను లాక్కున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతంరావు ఆరోపించారు.