Municipal Politics:జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో వందేమాతరం వివాదం
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:10 AM
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది...
బీజేపీ, ఎంఐఎం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం
వందేమాతర గీతం ఆలపిస్తుండగా ఎంఐఎం సభ్యులు నిలబడలేదని బీజేపీ ఆరోపణ
తమని అవమానించరంటూ మజ్లిస్ సభ్యుల అభ్యంతరం
కుర్చీలు ఎక్కి ఇరువర్గాల పోటాపోటీ నినాదాలు
హైదరాబాద్ సిటీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా వందేమాతరం గీతం విషయంలో బీజేపీ, ఎంఐఎం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశ మందిరం పోటాపోటీ నినాదాలతో హోరెత్తింది. అసలేం జరిగిందంటే.. బీజేపీ సభ్యులు పట్టుబట్టడంతో కౌన్సిల్ సమావేశంలో జయజయహే తెలంగాణ గీతంతోపాటు వందేమాతరం గీతాన్ని కూడా ఆలపించాలని మేయర్ విజయలక్ష్మి నిర్ణయించారు. అయితే, వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు ఎంఐఎంకు చెందిన కొందరు సభ్యులు లేచి నిలబడకుండా తమ కుర్చీల్లోనే కూర్చున్నారంటూ బీజేపీ సభ్యులు ఆరోపించారు. వందేమాతరం ఆలపిస్తున్నప్పుడు కనీస గౌరవం లేకుండా కూర్చున్న వారికి సభలో ఉండే అర్హత లేదని బీజేపీ కార్పొరేటర్ ఒకరు వ్యాఖ్యానించారు. దీనిపై ఎదురుదాడికి దిగిన ఎంఐఎం సభ్యులు.. బీజేపీ సభ్యులు తమను అవమానించారని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కుర్చీల మీదకు ఎక్కి బీజేపీ తీరుపై నిరసన తెలియజేశారు. స్పందించిన బీజేపీ సభ్యులు కూడా కుర్చీల పైకి ఎక్కి ఎంఐఎంకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. దీంతో ఇరుపార్టీల సభ్యుల తీరుపై మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు ఎక్కిన వారిని బయటకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎంపీ రఘునందన్‌రావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ స్పందించారు. సభ్యుడు మైకులో మాట్లాడని వ్యాఖ్యలు రికార్డుల పరిధిలోకి రావని, వ్యక్తిగత వ్యాఖ్యలపై వివాదం చేయడం సరికాదన్నారు.