సింగరేణి లాభాలపై స్పష్టత...!
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:02 PM
సింగ రేణి సంస్థ గడించిన లాభాలను ఎట్టకేలకు ప్రకటిం చింది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు 2024-25 ఆర్థిక సంవత్స రానికిగాను సంస్థ ఆర్జించిన నికర లాభం రూ. 6,394 కోట్లుగా ప్రకటించారు.
-2024-25లో రూ. 2360 కోట్లుగా ప్రకటించిన ప్రభుత్వం
-లాభాల్లో 34 శాతం వాటా చెల్లించేందుకు అంగీకారం
-కార్మికుల వాటాకింద కేటాయించింది రూ. 819 కోట్లు
-ఒక్కో కార్మికుడికి సగటున రూ. లక్షా 95వేల పై చిలుకు
-ఏకపక్ష నిర్ణయంపై ఏఐటీయూసీ పెదవి విరుపు
మంచిర్యాల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సింగ రేణి సంస్థ గడించిన లాభాలను ఎట్టకేలకు ప్రకటిం చింది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు 2024-25 ఆర్థిక సంవత్స రానికిగాను సంస్థ ఆర్జించిన నికర లాభం రూ. 6,394 కోట్లుగా ప్రకటించారు. అందులో సింగరేణి భవిష్యత్తు లో చేపట్టే కొత్త ప్రాజెక్టుల కోసం రూ. 4,034 కోట్లను కేటాయించగా, మిగిలిన రూ. 2,360 కోట్లలో రూ. 34 శాతం సొమ్ము అంటే రూ. 819 కోట్లను కార్మికుల వా టాగా బోనస్‌గా ప్రకటించారు. ఈ లెక్కన సంస్థలో ప ని చేస్తున్న 41వేల మంది కారికులకు ప్రకటించిన ప్ర కారం 34 శాతం లాభాల బోనస్ కింద ఒక్కొక్కరికి స గటున రూ. 1,95,610 వరకు లభించనున్నాయి. గత ఏడాది సగటున ఒక్కో కార్మికుడికి రూ. 1,87,321 లా భాల బోనస్ చెల్లించగా, దాంతో పోల్చితే ఈ ఏడాది సగటున ఒక్కో ఉద్యోగికి అదనంగా రూ. 8,289 వరకు బోనస్ లభించనుంది. ఇదిలా ఉండగా సింగరేణి నికర లాభాలు, కార్మికుల వాటా ప్రకటించడంలో సుదీర్ఘంగా జాప్యం జరిగింది. ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నె లలు గడుస్తుండటంతో ఎట్టకేలకు లాభాల వాటా ప్ర కటనకు మోక్షం లభించినట్లయింది. అదే కోలిండియా లో ప్రతీ త్రైమాసికానికి ఒకసారి లాభాలను ప్రకటి స్తుండగా, సింగరేణిలో మాత్రం సుదీర్ఘకాలం పాటు జాప్యం జరగడం పట్ల కార్మికులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆర్థిక సంవత్సరం ము గిసిన వెంటనే ఆడిట్ నిర్వహించి లాభాలను ప్రకటిం చాల్సి ఉంది. అయితే కొన్నేళ్లుగా లాభాల ప్రకటనకు ప్రభుత్వం ఆరేడు నెలల సమయం తీసుకుంటున్నారు.
69 మిలియన్ టన్నుల ఉత్పత్తి...
2024-2025 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అన్ని ఏరియాల్లో కలిపి మొత్తంగా 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది. అంతకు ఏడాదితో పోల్చి తే కొంతమేర ఉత్పత్తి తగ్గింది. 2023-2024లో 70.01 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగగా, గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగా ఉత్పత్తిపై ప్రభావం చూపింది. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం సాధిం చిన ఉత్పత్తిపై రూ. 6,394 కోట్లు నికర లాభాలు రావడం కొసమెరుపు.
ఏటేటా పెరుగుతున్న లాభాలు.....
సింగరేణిలో ప్రతీ ఏటా ఉత్పత్తి లక్ష్యం మేరకు జరు గుతుండగా అదే స్థాయిలో నికర లాభాలను కూడా సంస్థ ఆర్జిస్తోంది. 2013-14లో రూ. 11928 కోట్లుగా ఉ న్న అమ్మకాలు 123 శాతం వృద్ధితో గత ఏడాదికి రూ. 26607 కోట్లకు చేరుకున్నాయి. లాభాలు కూడా గరి ష్టంగా 193 శాతానికి పెరిగాయి. 2013-14లో రూ. 419 కోట్లు నికర లాభం సాధించగా 1999-2000లో రూ. 300 కోట్ల లాభాలు ఆర్జించింది. అందులో యాజమా న్యం 10 శాతం బోనస్ ప్రకటించగా, రూ. 30 కోట్లు మాత్రమే కార్మికుల వాటాగా లభించింది. 2000-21లో రూ. 805 బోనస్ ప్రకటించగా, 2021-22 నాటికి రూ. 1227 కోట్ల రూపాయలను సంస్థ ఆర్జించింది. అలాగే 2023-24లో సంస్థ సాధించిన టర్నోవర్‌పై కార్మికులు లాభాల వాటా కింద 33 శాతాన్ని ప్రభుత్వం ప్రకటిం చింది. గతేడాది రూ. 763 కోట్లు ప్రకటించగా, ఈ సం వత్సరం కార్మికులు, జాతీయ కార్మిక సంఘాల నాయ కులు 35 శాతం వాటా కోసం డిమాండ్ చేశారు. అయి తే ప్రభుత్వం దాన్ని 34 శాతానికి పరిమితం చేసి లా భాల వాటాను కార్మికులకు అందజేయనున్నట్లు ప్రక టించింది. ఎనిమిదేళ్ల కాలంలో ప్రగతి బాటన పయ ణిస్తున్న కంపెనీ ఏటేటా తన లాభాలను పెంచుతూ వస్తోంది.
కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5,500 చెల్లింపు....
పర్మినెంట్ కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటాను ప్రకటించిన సింగరేణి యాజమాన్యం సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా ఒక్కొక్కరికి రూ. 5,500 బోనస్ ప్రకటించింది. గతేడాది కాంట్రాక్టు కార్మికులకు రూ. 5వేల చొప్పున బోనస్ ప్రకటించగా, ఈ ఏడాది రూ. 500 అదనంగా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. యాజమాన్యం నిర్ణయంతో సంస్థలో పని చేస్తున్న 30వేల మంది కాంట్రాక్టు కార్మికులకు లబ్ది చేకూరనుంది.
వాస్తవ లాభాల నుంచి చెల్లిస్తే బాగుండేది....పిట్టల తిరుపతి, ఈపీ ఆపరేటర్, శ్రీరాంపూర్ ఓసీపీ
సింగరేణిలో లాభాల వాటా అనేది ప్రభుత్వ పథకం కాదు. ఇది సంస్థలో పని చేస్తున్న కార్మికుల శ్రమ. గత ఏడాది 33 శాతం లాభాల వాటాను ఇవ్వగా, ఈ ఏడా ది 34 శాతం ప్రకటించారు. లాభాల వాటాను కంపెనీ నికర లాభాల్లో నుంచి ప్రకటిస్తే బాగుండేది. మొత్తం నికర లాభాలు రూ. 6వేల పై చిలుకు కోట్లు ఉండగా, అందులో కేవలం రూ. 2 వేల కోట్ల పై చిలుకు నుంచే 34 శాతం ప్రకటించడం సమంజసంగా లేదు.
ఏకపక్ష నిర్ణయం సరికాదు....
వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు
లాభాల వాటా ప్రకటించడంలో ప్రభుత్వం ఏకపక్షం గా వ్యవహరించింది. రెండు రోజుల ముందుగానే డి ప్యూటీ సీఎం, సీఎండీలతో చర్చకు పట్టుపట్టగా, త ప్పుదోవ పట్టించి ఏకపక్ష నిర్ణయంతో లాభాల వాటాను ప్రకటించడం సమంజసం కాదు. గత ఏడాది కేవలం రూ. 2 వేల కోట్లను మాత్రమే ఫ్యూచర్ ప్రాజెక్టుల కో సం కేటాయించిన ప్రభుత్వం, ఈ ఏడాది నికరలా భా ల్లో నుంచి ఏకంగా రూ. 4 వేల కోట్ల పై చిలుకు కేటా యించారు. గత సంవత్సరం కేటాయించిన రూ 2 వేల కోట్లను ఎక్కడ ఖర్చు చేశారో కార్మికులకు తెలియజే యాల్సిన అవసరం ఉంది.