Share News

TSRTC: సిటీ బస్సుల్లో చార్జీల బాదుడు

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:39 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో సిటీ బస్సుల టికెట్‌ చార్జీలు పెంచుతున్నట్టు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సహా అన్ని రకాల బస్సుల్లో...

TSRTC: సిటీ బస్సుల్లో చార్జీల బాదుడు

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో తిరిగే సిటీ బస్సుల టికెట్ల ధరలు పెంపు.. స్టేజీల వారీగా రూ.5-10 మేర మోత

  • ఆర్డినరీ, మెట్రో సహా అన్ని రకాల బస్సులకు వర్తింపు

  • సిటీ ఆర్డినరీలో ఇకపై కనీస టికెట్‌ ధర రూ.15

  • సోమవారం నుంచి అమలులోకి కొత్త చార్జీలు

  • టీజీఎ్‌సఆర్టీసీ ప్రకటన

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో సిటీ బస్సుల టికెట్‌ చార్జీలు పెంచుతున్నట్టు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సహా అన్ని రకాల బస్సుల్లో టికెట్‌ ధరలను పెంచింది. బస్సు రూట్‌లోని స్టేజీల వారీగా రూ.5 నుంచి రూ.10 వరకు టికెట్‌ ధరను పెంచుతున్నట్టు వెల్లడించింది. పెంచిన ధరల ప్రకారం.. సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్‌ప్రెస్‌, ఈ- ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5, నాలుగో స్టేజీ నుంచి రూ.10 అదనపు చార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయనుంది. మెట్రోడీలక్స్‌, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో ఒక్కో టికెట్‌పై మొదటి స్టేజికీ రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు చార్జీని వసూలు చేయనున్నారు. పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఇన్నాళ్లూ రూ.10గా ఉన్న కనీస టికెట్‌ ధర రూ.15కు పెరగనుంది. కాగా, ఎలక్ట్రిక్‌ బస్సులు, వాటికి మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమయ్యే నిధుల కోసం సిటీ బస్సుల్లో చార్జీల పెంపునకు అనుమతినివ్వాలని టీజీఎ్‌సఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం సెప్టెంబరు 23నే ఆమోదించినట్టు తెలిసింది.

చార్జీల పెంపుతో ప్రయాణికులపై భారం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తిరిగే సిటీ బస్సుల్లో రోజుకు కనీసం 28 లక్షల మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇందులో 18లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. మిగిలిన వారిలో 2 లక్షల మంది నెలవారీ బస్‌ పాస్‌లు, డే పాస్‌లతో ప్రయాణాలు చేస్తుండగా 8 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణాలు సాగిస్తున్నారు. చార్జీల పెంపుతో ఒక్కో ప్రయాణికుడిపై నెలకు రూ.300-500 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. సిటీ ఆర్డినరీ బస్సుల్లో స్టాప్‌ల వారీగా మొదటి స్టాప్‌కు 10, 15, 25 చొప్పున చార్జీలు వసూలు చేస్తుండగా చార్జీల పెంపుతో రూ.15, 20, 30కి చేరనున్నాయి. ఆ తర్వాత నాలుగో స్టేజీ నుంచి రూ.30 టికెట్‌ రూ. 40కి పెరగనుంది. మహాలక్ష్మితో ఉచిత ప్రయాణాలు అందిస్తున్న ఆర్టీసీ.. చార్జీలను ఈ స్థాయిలో పెంచడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Oct 05 , 2025 | 05:39 AM