Encounter in the Bairangadh forests: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:50 AM
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల్లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ...
12 మంది మావోయిస్టుల మృతి
ముగ్గురు జవాన్ల మృత్యువాత
బైంగఢ్ అడవుల్లో కూంబింగ్
ఘటనా స్థలానికి అదనపు బలగాలు
మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం
చింతూరు/చర్ల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల్లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు కూడా మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి ఇన్‌సాస్, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 303 తుపాకులు, ఎల్‌ఎంజీ మెషీన్ గన్లు, ఏకే 47లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బైరంగఢ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. బీజాపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు చెప్పారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మరికొందరు మావోయిస్టులు మరణించి ఉంటారని ఐజీ పేర్కొన్నారు. చాలా మంది తప్పించుకున్నారని, గురువారం కూడా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. మృతుల్లో పీఎల్‌జీఏ రెండో బెటాలియన్ కమాండర్ మొడియం వెల్ల ఉన్నాడని, అతనిపై రూ.8 లక్షలు రివార్డు ఉందని వెల్లడించారు. కాగా ఘటనా స్థలంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఏటా డిసెంబరు 2 నుంచి వారం రోజుల పాటు పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.