kumaram bheem asifabad- పడిగాపులకు చెక్
ABN , Publish Date - Dec 30 , 2025 | 10:20 PM
యూరియా కోసం ఇక క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. వ్యవసాయ శాఖ తీసుకొస్తున్న యాప్‌లో బుక్ చేసుకుంటే నేరుగా మీకు యూరియా అందుతోంది. ఈకొత్త సాంకేతిక వ్యవస్థను వ్యవసాయ శాఖ ఈ నెల 20 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గత ఖరీఫ్‌లో అవసరం మేర యూరియా లభ్యం కాకపోవ డంతో పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు
- ఇంటి నుంచే బుకింగ్‌కు అవకాశం
- ఈనెల 20వ తేదీ నుంచి నూతన విధానం అమలు
బెజ్జూరు/కాగజ్‌నగర్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం ఇక క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. వ్యవసాయ శాఖ తీసుకొస్తున్న యాప్‌లో బుక్ చేసుకుంటే నేరుగా మీకు యూరియా అందుతోంది. ఈకొత్త సాంకేతిక వ్యవస్థను వ్యవసాయ శాఖ ఈ నెల 20 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గత ఖరీఫ్‌లో అవసరం మేర యూరియా లభ్యం కాకపోవ డంతో పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో యూరియా పక్కదారి పట్టకుండా సాగు రైతులకు చేరేలా ఈ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇప్పటికే పూర్తయ్యింది. యాసంగి నుం చి అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రైతులకు సరిపడా లభించేలా కొత్తగా బుకింగ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తికాగా, జిల్లాల వారిగా వ్యవసాయ అధికారులతో పాటు డీలర్లు, తదితరులకు యాప్‌పై అవగాహన కల్పించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది.
- జిల్లాలో ఇలా..
జిల్లాలో యాసంగి సీజన్ కోసం 45,000మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, రైతులు ఒకేసారి తీసుకెళ్లడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యాప్‌ను రూపొందించింది. యాప్‌లో పట్టాదారు పాసుపుస్తకం నంబరు నమోదు చేయగానే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది నమోదు చేయగానే సదరు రైతుకు ఎన్ని ఎకరాలుంది, ఏ పంట వేశారనే వివరాలతో పాటు పంటకు ఎంత యూరియా అవసరమనే సమాచారం, బుకింగ్ ఐడీ వస్తుంది. ఏదైనా అధీకృత రిటైలర్ లేదా సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తారు. కాగా రైతులు యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని విడతల వారిగా యూరియా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులు రెండు విడతల్లో, ఐదు నుంచి ఇరవై ఎకరాలున్న రైతులు మూడు, అంతకన్న ఎక్కువ ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కేవలం 48గంటలు మాత్రమే ఉంటుంది. ఆలోగా యూరియా తీసుకోనట్లయితే తిరిగి అది స్లాట్‌లోకి వెళ్తుంది. ఈ యాప్‌తో జిల్లా మొత్తంలో యూరియా ఎక్కడెక్కడ ఎంత అందుబాటులో ఉందనే సమాచారం అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
- తీరనున్న ఇబ్బందులు..
ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్‌తో ఇబ్బందులు తొలగనున్నాయి. రైతులు ఎంత పలుకుబడి ఉపయోగిం చినా ఎక్కువ మొత్తంలో బస్తాలను ఇవ్వలేకుండా యాప్ ఉంది. ఎరువుల పంపిణీ కూడా పారదర్శకంగా ఉంటుంది. ఇరవై రోజులకు ఒకసారి మాత్రమే ఎరువులు ఇవ్వాలని నిబంధన పెట్టడంతో అక్రమాలకు చెక్ పడనుంది. దీంతో రైతులకు కూడా పంట సాగుకు సరిపడా ఎరువులు అందే అవకాశం ఉంటుంది. గత సీజన్‌లో యూరియా కొరతతో రైతులు అవసరానికి మించి కూడా నిలువ చేసుకున్నారు. మరికొందరు రైతులు ఇతర జిల్లాలు, మండలాల్లో ఉన్న బంధువులకు పంపించారు. దీంతో యాసంగి సీజన్‌లో ప్రత్యేక యాప్ రూపకల్పన చేయడంతో జిల్లాలోని ప్రతి ఎరువుల దుకాణంలో ఈ యాప్ ద్వారా మాత్రమే రైతులు ఎరువులు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక జిల్లాలో యూరియా కొరత ఉండదు. ఎక్కడా కూడా ఎక్కువ బస్తాలు తీసుకోవాలనుకున్నా సాధ్యం కాదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.