Share News

Union Minister Bandi Sanjay: చర్లపల్లి జైలు దేశానికి ఆదర్శం

ABN , Publish Date - Oct 14 , 2025 | 02:35 AM

ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలులో చేపడుతున్న సంస్కరణలు దేశానికి ఆదర్శమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు...

Union Minister Bandi Sanjay: చర్లపల్లి జైలు దేశానికి ఆదర్శం

  • ఖైదీల సంక్షేమంలో నంబర్‌ వన్‌: కేంద్ర మంత్రి సంజయ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలులో చేపడుతున్న సంస్కరణలు దేశానికి ఆదర్శమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఖైదీలకు బీమా సౌకర్యం కల్పిస్తూ నంబర్‌ వన్‌గా నిలుస్తోందని ప్రశంసించారు. వారి కుటుంబ సభ్యులకు వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పించడం అభినందనీయని అన్నారు. మహిళా ఖైదీల పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తూ ఫీజులను కూడా జైళ్ల శాఖ చెల్లించడం గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్‌ను అభినందించారు. కస్టడీ-కేర్‌-కరక్షన్‌ కు సౌమ్య మిశ్రా నిజమైన ఆచరణ రూపమిస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ సోమవారం చర్లపల్లి జైలును సందర్శించారు. ఖైదీల కోసం ఏర్పాటు చేసిన పరిశ్రమల గురించి, వారు తయారు చేస్తున్న ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోశాలను సందర్శించిన ఆయన గోవులకు మేత తినిపించి, ఒక లేగ ఆవుకు ‘కృష్ణ’ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ఇతర రాష్ర్టాల జైళ్ల శాఖలు సైతం చర్లపల్లి జైలును సందర్శించి సంస్కరణలు అమలు చేేసలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యమైనవిగా ఉన్నందున హైదరాబాద్‌ లో ‘ప్రత్యేక మేళా’ నిర్వహించాలని సూచించారు.

Updated Date - Oct 14 , 2025 | 02:35 AM