Share News

Chandana Mohanrao: చందన మోహనరావు కన్నుమూత

ABN , Publish Date - Oct 22 , 2025 | 05:15 AM

ప్రముఖ వస్త్ర వ్యాపారి చందన మోహనరావు సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహనరావు..

Chandana Mohanrao: చందన మోహనరావు కన్నుమూత

  • సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్స్‌ స్థాపకుడిగా విశేష గుర్తింపు

  • వ్యాపారవేత్తలు, ప్రజా ప్రతినిధుల నివాళి

విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ వస్త్ర వ్యాపారి చందన మోహనరావు సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహనరావు(82) విశాఖపట్నం కేఆర్‌ఎం కాలనీలోని ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మోహనరావు 1984లో విశాఖ జగదాంబ సెంటర్‌ వద్ద చందన బ్రదర్స్‌ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. హోల్‌సేల్‌ రేట్లకే రిటైల్‌ అమ్మకం నినాదంతో వ్యాపారంలో నూతన ఒరవడి సృష్టించారు. 1988లో హైదరాబాద్‌, 1989లో విజయవాడలో చందన బ్రదర్స్‌ దుకాణాలను ప్రారంభించారు. అదే క్రమంలో 1998లో జ్యువెలరీ రంగంలోకి ప్రవేశించి, తొలిసారిగా హాల్‌మార్క్‌ బంగారు ఆభరణాలను తెలుగు రాష్ర్టాలకు పరిచయం చేశారు. పొగడ్తలంటే ఇష్టపడని మోహనరావు తన పేరు మీద వ్యాపారం ప్రారంభించేందుకు విముఖత చూపేవారు. అయితే అల్లుడు మావూరి వెంకటరమణ ప్రోద్బలంతో 2002లో విశాఖలో మొదటిసారిగా సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ ప్రారంభించారు. రెండు రాష్ట్రాల్లో ఏర్పాటుచేసిన సీఎంఆర్‌ మాల్స్‌తో వేల కుటుంబాలకు ఉపాధి కల్పించడమే కాక, సీఎంఆర్‌ చారిటబుల్‌ ట్రస్టును స్థాపించి అనేకమంది పేద విద్యార్థులకు విద్యా దానం చేశారు. అవసరంలో ఉన్న వారిని ఆదుకునే దాతగా పేరు తెచ్చుకున్నారు. మృదు స్వభావిగా పేరుగాంచిన మోహనరావు వేల మందికి ఆదర్శంగా నిలిచారు. మోహనరావు మృతిపై నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రజా ప్రతినిధులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చందన మోహనరావు అల్లుడు, సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - Oct 22 , 2025 | 05:15 AM