Share News

Congress MP Chamal Kiran Kumar Reddy: కిషన్‌రెడ్డీ.. దొంగ లెక్కలు వద్దు

ABN , Publish Date - Dec 08 , 2025 | 04:08 AM

కేంద్రం నుంచి తెలంగాణకు రూ.13 లక్షల కోట్ల నిధులు వచ్చాయంటున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఏ శాఖకు ఆ నిధులు....

Congress MP Chamal Kiran Kumar Reddy: కిషన్‌రెడ్డీ.. దొంగ లెక్కలు వద్దు

హైదరాబాద్‌/పర్వతగిరి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నుంచి తెలంగాణకు రూ.13 లక్షల కోట్ల నిధులు వచ్చాయంటున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఏ శాఖకు ఆ నిధులు తెచ్చారో చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దొంగ లెక్కలు చెప్పడం కాదని.. తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు వస్తే రూ.8 లక్షల కోట్ల అప్పు ఎందుకైందని ప్రశ్నించారు. తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటుంటే.. రాష్ట్రం అప్పుల పాలవుతుంటే.. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి రాష్ట్రాన్ని రక్షించే ప్రయత్నం కిషన్‌రెడ్డి ఎందుకు చేయలేదని ఆదివారం ఓ ప్రకటనలో నిలదీశారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలుచేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే బీజేపీ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని దుయ్యబట్టారు. గ్లోబల్‌ సమ్మిట్‌కు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు హాజరై ప్రతినిధులకు భరోసా కల్పించాలని సూచించారు. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికుల ఇబ్బందులకు ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని.. ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘హరీశ్‌ రావు.. సీఎం రేవంత్‌రెడ్డిని రంగనాయకసాగర్‌లో వేస్తానంటున్నావు. తెలంగాణ ప్రజలు రెండేళ్ల కిందటే నిన్ను, నీ మామను, నీ బావమరిదిని కాళేశ్వరంలో వేశారు. మీరెప్పుడో కూలిన కాళేశ్వరంలో మునిగిపోయారు. మీ పార్టీ కూడా అందులో సమాధి అయిపోయింది’ అంటూ ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ధ్వజమెత్తారు. మేడిగడ్డకు పగుళ్లు రాలేదని హరీశ్‌ ఆయన పిల్లలపై ఒట్టేసి చెప్పగలరా అని నిలదీశారు. రంగనాయకసాగర్‌ నీళ్లు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినవేనని నిరూపించగలరా అని సవాల్‌ విసిరారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పత్తా లేకుండా పోయిందని, అనేక గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే పోటీ నడుస్తోందన్నారు. కాగా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

రసాభాసగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రచారం..

వర్ధన్నపేట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు పర్వతగిరి మండలంలో చేపట్టిన ఎన్నికల ప్రచారం రసాభాసగా సాగింది. దౌలత్‌నగర్‌ గ్రామంలో ప్రచార వాహనంపైకి ఎమ్మెల్యే రాగానే.. కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి ఐలపాక స్వప్న, రెబల్‌ అభ్యర్థి ఐలపాక మల్లికాంబ ఇద్దరూ వాహనం ఎక్కడంతో వాగ్వాదం మొదలైంది. తాను పార్టీ అభ్యర్థిని అంటే.. తానేనంటూ ఎమ్మెల్యే ముందు వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

Updated Date - Dec 08 , 2025 | 04:08 AM