Bhoo Bharati: భూ భారతికి కొత్త సవాళ్లు
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:02 AM
భూ వివాదాలను పారదర్శకంగా పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి...
వివాదాల పరిష్కారంలో సమస్యలు.. మితిమీరుతున్న రాజకీయ జోక్యం
ఇతర బాధ్యతల్లో బిజీగా తహసీల్దార్లు
సమయం లేదనే కారణంతో కాలయాపన
సాంకేతికతపై అవగాహనలేక ఇబ్బందులు
తగిన శిక్షణ ఇవ్వాలంటున్న నిపుణులు
భూముల సర్వేతోనే 95ు వివాదాలకు పరిష్కారం లభిస్తుందని సూచనలు
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): భూ వివాదాలను పారదర్శకంగా పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. రెవెన్యూ అధికారులకు అనేక ఇతర బాధ్యతలు ఉండడంతో.. ఈ పోర్టల్‌కు వచ్చే దరఖాస్తులను పరిష్కరించేంత సమయం వారికి ఉండడంలేదు. దీనికితోడు భూ వివాదాల్లో రాజకీయ జోక్యం ఉంటుండడంతో అధికారులు నిష్పక్షపాతంగా త్వరితగతిన తీర్పులు ఇచ్చే పరిస్థితులు లేవు. అంతేకాకుండా.. ఎక్కువ మంది అధికారులకు సాంకేతికతపై అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. వీటన్నింటినీ అధిగమిస్తే తప్ప.. భూభారతి చట్టం ద్వారా ప్రజలకు న్యాయం జరిగే అవకాశాలు లేవు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి భూ రికార్డుల నిర్వహణ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్‌ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వ్యవస్థ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. రైతులు తమ భూములు కోల్పోయి, కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ‘తెలంగాణ భూభారతి’ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ధరణి లోపాలను సరిచేసి, భూ వివాదాలను సమర్థవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ఉంది. వాస్తవానికి భూభారతి చట్టం-2025 ప్రధాన లక్ష్యాల్లో మొదటిది.. ప్రతి అంగుళం భూమికీ చట్టపరమైన హక్కు కల్పించడం. రెండోది మ్యుటేషన్ ప్రక్రియ.. భూమి బదిలీ, వారసత్వ హక్కుల నమోదును సరళీకరించడం. మునుపటి వ్యవస్థల్లో ఈ ప్రక్రియకు వారాలు, నెలల కొద్దీ సమయం పట్టేది. ఇప్పుడు డిజిటల్‌గా వేగంగా పని జరుగుతోంది. అయితే సాంకేతికతపై చాలా మంది తహసీల్దార్లకు అవగాహన లేదనే విమర్శలున్నాయి. దీంతో భూభారతి ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు, రియల్-టైమ్ ట్రాకింగ్ సౌలభ్యాలను అందుబాటులోకి తెచ్చినా.. ప్రజలకు చేరువకావడం లేదు. దీనికితోడు ఎన్నికల నిర్వహణ, విపత్తుల నిర్వహణ, జనగణన, ప్రొటోకాల్ డ్యూటీలు, శాంతిభద్రతలు, పౌరసరఫరాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి కార్యక్రమాలతో రెవెన్యూ అధికారులు సతమతమవుతున్నారు. చాలా చోట్ల న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ఇతరత్రా బిజీ పనులు ఉన్నాయనే సాకుతో భూ సమస్యలను తహసీల్దార్లు ముట్టుకోవడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి.
దీనికితోడు రాజకీయ జోక్యం పెద్ద సమస్యగా మారింది. భూ వివాదాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, మండల స్థాయి నాయకులు జోక్యం చేసుకుంటారు. దీంతో రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా త్వరితగతిన తీర్పులు చెప్పే పరిస్థితులు లేవు. పైగా చట్టాల పట్ల రెవెన్యూ అధికారులకు అవగాహన కూడా అంతంతమాత్రమే. ఇదంతా ఒక ఎత్తయితే అవినీతి మరో పెద్ద సమస్య. 2020 చట్టం కింద జిల్లా ట్రైబ్యునళ్లు.. పార్టీలు చెప్పేది వినకుండా హడావిడిగా ఆర్డర్లు ఇచ్చి మరిన్ని వివాదాలు సృష్టించాయి. దీంతో జిల్లా స్థాయి అధికారులే అలా చేస్తే.. కిందివారి నుంచిఏం ఆశించగలమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అప్పీల్ వ్యవస్థ సంక్లిష్టంగా ఉందనే విమర్శలున్నాయి.
సర్వేయర్లను నియమిస్తేనే...
రైతులకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఇప్పటికే 10 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి, వాటిలో 3.27 లక్షల ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. దీనిని బట్టి ఈ వ్యవస్థపై ప్రజలు నమ్మకం పెంచుకుంటున్నారని అర్థమవుతుంది. కానీ, ఇది పూర్తిగా విజయవంతమవ్వాలంటే ఆచరణలో అనేక సమస్యలను అధిగమించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 10,954 మంది గ్రామ పాలనాధికారుల (జీపీవోల)ను నియమించాలని నిర్ణయించి 5,106మందికి సెప్టెంబరు 5న నియామక పత్రాలు అందజేసింది. అంతేకాకుండా.. ప్రతి మండలంలో నాలుగు నుంచి ఆరుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించడం ద్వారా భూవివాదాల పరిష్కారం వేగవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 95శాతం భూ వివాదాలు సర్వే లేకుండా పరిష్కారం కావు. భూమి సర్వే లేకుండా రికార్డులు మార్చడం అసాధ్యం. కానీ, ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్ల వ్యవస్థపై ఆధారపడుతూ గాలిలో దీపం పెట్టిన చందంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. భూమి సర్వేలు వేగంగా జరిగి.. వివాదాలు తగ్గాలన్నా ప్రభుత్వం రాష్ట్రంలోని 10,500 గ్రామాలకు ఒక్కొక్కరు చొప్పున సర్వేయర్‌ను గానీ, లేదా కనీసం రెండు గ్రామాలకు ఒకరిని గానీ నియమించాలని సర్వే విభాగానికి చెందిన మాజీ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు అభిప్రాయపడ్డారు. గ్రామపరిపాలన అధికారుల సంఖ్యను 5,250కి పరిమితం చేసి 5,250మంది విలేజ్ సర్వేయర్లను నియమిస్తే మంచిదని చెప్పారు. రీ సర్వే జరగాలని, కచ్చితమైన పటాలు అన్ని భూములకూ ఉండాలని పేర్కొన్నారు. దీంతోపాటు రాజకీయ జోక్యాన్ని నివారించాలని, రెవెన్యూ అధికారులకు సరైన శిక్షణ, తగినంత సమయం ఇవ్వాలని అన్నారు.