Share News

CH Vidyasagar Rao: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:55 AM

నాడు పార్టీలకు అతీతంగా తెలంగాణ విమోచన ఉద్యమం జరిగిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు..

CH Vidyasagar Rao: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నాడు పార్టీలకు అతీతంగా తెలంగాణ విమోచన ఉద్యమం జరిగిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. కమ్యూనిస్టు నేత రావినారాయణరెడ్డి నేతృత్వంలో మొట్టమొదటి సత్యాగ్రహం జరిగితే అందులో ఆర్యసమాజ్‌, కాంగ్రెస్‌ వారితో పాటు అన్ని పార్టీల వాళ్లూ పాలుపంచుకున్నారని.. ఈ ఉద్యమ క్రమంలో ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించేందుకు నాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మెట్టుదిగినా.. ఈ కార్యక్రమం పేరు మాత్రం మార్చాయన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా గుర్తిస్తూ గతేడాది కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భాస్కర యోగి రచించిన ‘‘సెప్టెంబరు 17 ముమ్మాటికీ విమోచనే’’ అనే పుస్తకాన్ని విద్యాసాగర్‌ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ 27 ఏళ్లపాటు ఉద్యమం చేసినట్లు తెలిపారు. 1998లో నిర్వహించిన బహిరంగసభకు నాటి పార్టీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ హాజరై 120 మంది సమరయోధులకు స్వయంగా సన్మానం చేశారని విద్యాసాగర్‌రావు గుర్తు చేశారు.

Updated Date - Sep 16 , 2025 | 05:55 AM