Share News

Centre Draft Electricity: ఇక డిస్కమ్‌ల పోటీ

ABN , Publish Date - Oct 11 , 2025 | 02:41 AM

ఒకే ప్రాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ డిస్కమ్‌లు రావొచ్చు. వినియోగదారుడు తనకు నచ్చిన డిస్కమ్‌ నుంచి కరెంట్‌ కొనుగోలు చేయవచ్చు..

Centre Draft Electricity: ఇక డిస్కమ్‌ల పోటీ

  • ఒకే ప్రాంతంలో బహుళ డిస్కమ్‌ల విద్యుత్‌ సరఫరా

  • ప్రస్తుత నెట్‌వర్క్‌ ను వాడుకుని వ్యాపారం చేసుకునే చాన్స్‌

  • ముసాయిదా విద్యుత్‌ సవరణ బిల్లు-2025 తెచ్చిన కేంద్రం

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఒకే ప్రాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ డిస్కమ్‌లు రావొచ్చు. వినియోగదారుడు తనకు నచ్చిన డిస్కమ్‌ నుంచి కరెంట్‌ కొనుగోలు చేయవచ్చు. డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలంటే విధిగా నెట్‌వర్క్‌ (స్తంభాలు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు) కలిగి ఉండాలనే నిబంధన సడలింపు. ఇప్పటికే ఒక ప్రాంతంలో ఉన్న డిస్కమ్‌ల లైన్లు, నెట్‌వర్క్‌ను వాడుకొని వేరే డిస్కమ్‌లు వ్యాపారం చేసుకునే వెసులుబాటు. విద్యుత్‌ నియంత్రణ మండళ్లు(ఈఆర్‌సీ) సుమోటోగా చార్జీలు ఖరారు చేసే అధికారం. క్రాస్‌ సబ్సిడీ సర్‌చార్జీ రద్దు. ఇవీ.. విద్యుత్‌ పంపిణీ రంగంలో కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ తెచ్చిన ముసాయిదా బిల్లు (విద్యుత్‌(సవరణ) బిల్లు-2025)లోని ముఖ్యాంశాలు. దీన్ని రాష్ట్రాలకు పంపిన కేంద్రం, నెల రోజుల్లోగా అభిప్రాయం తెలియజేయాలని కోరింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. టెలికం రంగంలాగే విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా.. ఒక ప్రాంతంలో ఒకే నెట్‌వర్క్‌ను బహుళ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలు వాడుకునే వీలు కల్పించే ప్రతిపాదన అమల్లోకి వస్తే.. బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, జియో, ఐడియా, వోడాఫోన్‌ కంపెనీలు పోటీ పడ్డట్టుగా.. డిస్కమ్‌లు ఇంటింటికీ తిరిగి తమ కనెక్షనే తీసుకోవాలంటూ నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకే ఆఫర్‌ చేసే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్‌లాంటి దేశాల్లో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. గతంలో ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే విధిగా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కరెంట్‌ కనెక్షన్‌కూ అదే పరిస్థితి. దరఖాస్తు చేసుకున్నా.. రకరకాల కారణాలతో కరెంట్‌ కనెక్షన్‌ ఇవ్వకుండా తిప్పడం చాలా మంది విద్యుత్‌ సిబ్బందికి అనవాయితీగా మారింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే డిస్కమ్‌ల మధ్య పోటీ పెరిగి.. సిబ్బంది మన ఇంటికే వచ్చి తక్కువ ధరకే కనెక్షన్‌ ఇస్తామని ఆఫర్‌ చేసే అవకాశాలున్నాయి. అలాగే.. ముసాయిదా బిల్లు ప్రకారం ఒక యూనిట్‌కు అయ్యే వ్యయాన్ని పూర్తిస్థాయిలో డిస్కమ్‌లు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. సబ్సిడీ ఇవ్వదలుచుకుంటే నేరుగా ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో జమచేయాలి. లేదంటే ప్రత్యేకంగా ఒక ఖాతాను తెరిచి.. డిస్కమ్‌ల అకౌంట్‌లో జమచేయాల్సి ఉంటుంది. ముసాయిదాలోని మరో ముఖ్యమైన ప్రతిపాదన.. తయారీ రంగం, రైల్వే, మెట్రోలను క్రాస్‌ సబ్సిడీ భారం నుంచి ఐదేళ్లలోగా మినహాయించడం. క్రాస్‌ సబ్సిడీలంటే.. పరిశ్రమల వంటివాటికి సరఫరా చేసే విద్యుత్‌కు ఎక్కువ చార్జీలు వసూలు చేసి, ఆ ఆదాయంతో పేదలకు, రైతులకు రాయితీ ధరలకు విద్యుత్‌ సరఫరా చేయడం. ఈ క్రాస్‌ సబ్సిడీల భారం నుంచి తయారీ రంగాన్ని, రైల్వే, మెట్రోలను మినహాయించడం అంటే.. అవి విద్యుత్‌కు అధిక చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.


టారిఫ్‌ పిటిషన్‌ ఇవ్వకపోతే..

విద్యుత్‌ టారి్‌ఫలను సుమోటోగా సవరించే అధికారాన్ని రాష్ట్రాల విద్యుత్‌ నియంత్రణ సంస్థ (ఈఆర్‌సీ)లకు కల్పించే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం టారి్‌ఫలను సవరించాలంటే.. విద్యుత్‌ పంపిణీ సంస్థలు టారిఫ్‌ పిటిషన్‌ను ఈఆర్‌సీకి సమర్పించాల్సి ఉంటుంది. అందులో డిస్కమ్‌లు సమర్పించిన వివరాల ఆధారంగా.. ఆధారంగా ఈఆర్‌సీలు ప్రజాభిప్రాయాన్ని సేకరించి, అన్ని విధాలా సమీక్షించి కొత్త చార్జీలను నిర్ణయిస్తాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల కారణాల వల్ల (ఎన్నికల సమయంలో విద్యుత్‌ చార్జీలు పెరగడం ఇష్టం లేకనో, మరేవైనా రాజకీయకారణాలతోనో) డిస్కమ్‌లు టారిఫ్‌ పిటిషన్లను ఈఆర్‌సీకి సమర్పించకుండా ఆపుతాయి. ఫలితంగా చార్జీలు పెరగవుగానీ వ్యయాలు.. డిస్కంల నష్టాలు మాత్రం ఏటికేడాదీ పెరిగిపోతుంటాయి. అందుకే కేంద్రం ఈ ముసాయిదా బిల్లులో ఈఆర్‌సీలకు సుమోటోగా టారి్‌ఫలను సవరించే అధికారాన్ని కల్పించే ప్రతిపాదనను చేర్చింది. దీనివల్ల.. డిస్కమ్‌లు టారిఫ్‌ పిటిషన్లను సమర్పించకపోయినా ఈఆర్‌సీలు సొంతంగా నిర్ణయం తీసుకుని ఏటా ఏప్రిల్‌ 1 (ఆర్థిక సంవత్సరం మొదటిరోజు) నుంచి కొత్త టారి్‌ఫలు అమలయ్యేలా చూసే వీలుంటుంది. విద్యుత్‌ రంగంలో పాలసీలపై చర్చించడానికి వీలుగా జాతీయ స్థాయిలో కేంద్ర విద్యుత్‌ మంత్రి చైర్మన్‌గా ఎలక్ట్రిసిటీ కౌన్సిల్‌ ఏర్పాటు అవుతుంది. ఇందులో రాష్ట్రాల విద్యుత్‌ మంత్రులు సభ్యులుగా ఉంటారు. విధాన నిర్ణయాలపై సూచనలు, సలహాలు తీసుకోవడానికి ఈ కౌన్సిల్‌ ఉపయుక్తంగా ఉంటుంది.

మారిన లెక్కలు..

ప్రస్తుతం విద్యుత్‌ చౌర్యం కేసులో ఒక వినియోగదారుడిని పట్టుకుంటే... గరిష్ఠ వినియోగం ఆధారంగా రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు.. ఇలా ఇష్టం వచ్చిన కాలానికి డిస్కమ్‌లు జరిమానాలు వేస్తున్నాయి. ఇక ముందు అలా కుదరదు. ఆ వినియోగదారుడు ఎన్నేళ్లుగా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నా.. గరిష్ఠంగా ఏడాది కాలానికి మాత్రమే జరిమానాలు వేయాల్సి ఉంటుంది. ఈఆర్‌సీలు ఏ కేసునైనా నిర్దిష్టంగా నాలుగు నెలల్లోపు తేల్చాలి. ఒక మెగావాట్‌ కన్నా ఎక్కువ వినియోగం ఉన్న వినియోగదారులు డిస్కమ్‌ నుంచి లేదా ఓపెన్‌ యాక్సె్‌సలో నేరుగా కరెంట్‌ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Updated Date - Oct 11 , 2025 | 02:41 AM