Water Dispute Committee for TS & AP: జల జగడాలపై కమిటీ
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:26 AM
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ అధికారుల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు పరంగా కీలక అడుగు పడింది.
తెలంగాణ నుంచి ఏడుగురు
ఏపీ నుంచి నలుగురిని ప్రతిపాదించిన రాష్ట్రాలు
త్వరలో సంయుక్త కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ అధికారుల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు పరంగా కీలక అడుగు పడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తరఫున కమిటీలో ఉండాల్సిన అధికారుల పేర్లను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదించాయి. తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి, ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీ (జనరల్) మహ్మద్ అంజాద్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీ (టెక్నికల్) కె.శ్రీనివాస్, అంతర్రాష్ట్ర జల విభాగం ఎస్‌ఈ సల్లా విజయకుమార్, డిప్యూటీ డైరెక్టర్ (గోదావరి బేసిన్) సుబ్రహ్మణ్యం ప్రసాద్‌లను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 27న కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఏపీ తరఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారుడు, జలవనరుల శాఖ ఈఎన్‌సీ (ఇరిగేషన్) నర్సింహమూర్తి, అంతరాష్ట్ర జల వ్యవహారాల విభాగం సీఈలను కమిటీలో నియమించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన గత జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేసి సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో కేంద్ర జలశక్తి శాఖతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులను నియమించాలని అప్ప ట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాలు తమ అధికారుల పేర్లను ప్రతిపాదించిన నేపథ్యంలో త్వరలో కేంద్రం సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఏపీ, తెలంగాణ మధ్య ఇటీవల తీవ్ర వివాదస్పదమైన పోలవరం-బనకచర్ల/నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుతో పాటు ఇతర వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేయనుంది. రెండు రాష్ట్రా లు పేర్లు ప్రతిపాదించడంతో త్వరలోనే కేంద్రం సంయుక్త కమిటీ వేయనుంది. ఆ తర్వాత సమావేశమై... తదుపరి చర్చించాల్సిన అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.