Share News

Centre Orders Telangana Govt: గోదావరి పుష్కరాలకు సాయం కోరలేదు

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:25 AM

గోదావరి పుష్కరాలకు ప్రత్యేక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని కేంద్రం వెల్లడించింది. గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలైన....

Centre Orders Telangana Govt: గోదావరి పుష్కరాలకు సాయం కోరలేదు

  • రామగుండం బొగ్గు గని భూమి విషయంలో జరిమానా కట్టాల్సిందే.. తెలంగాణకు 3,852.61 కోట్ల ‘కంపా’ నిధులు

  • వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు భూమిని అప్పగించలేదు

  • కాంగ్రెస్‌ ఎంపీల ప్రశ్నలకు కేంద్రం సమాధానాలు

న్యూఢిల్లీ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు ప్రత్యేక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని కేంద్రం వెల్లడించింది. గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కాళేశ్వరం ఆలయాల అభివృద్ధికి, ఘాట్ల నిర్మాణానికి నిధులు కేటాయించారా? అంటూ కాంగ్రెస్‌ ఎంపీ వంశీకృష్ణ అడిగిప ప్రశ్నకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల కోసం సాయం చేయాలని తెలంగాణ కేంద్రాన్ని కోరలేదని తెలిపారు. రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వస్తే ‘స్వదేశ్‌ దర్శన్‌ 2.0’, ‘ప్రసాద్‌’ వంటి పథకాల కింద నిధులు మంజూరు చేస్తే అవకాశాలను పరిశీలిస్తామని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఆర్జీ కోల్‌మైన్‌ భూమికి సంబంధించి తాము విధించిన భారీ జరిమానాను తెలంగాణ చెల్లించాల్సిందేనని కేంద్రం తెలిపింది. కాంగ్రెస్‌ ఎంపీ రఘువీర్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ సమాధానమిచ్చారు. ‘పెద్దపల్లి జిల్లా ఉప్పర్ల కేషారం ఫారెస్ట్‌ బ్లాక్‌ పరిధిలోని 330.18 హెక్టార్ల భూమిని 1973లో రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూమిగా సింగరేణికి అప్పగించింది. 2013లో అది అటవీ భూమిని తేలడంతో కేంద్రం భారీ జరిమానా (ఐదు రెట్లు) విధించింది. ఈ పెనాల్టీని మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా అడ్వైజరీ కమిటీ పరిశీలించి అభ్యర్థనను తిరస్కరించింది’ అని కేంద్ర మంత్రి వివరించారు. ఇప్పటికే సింగరేణి సంస్థ సాధారణ నెట్‌ ప్రజెంట్‌ వాల్యూ, సేఫ్టీ జోన్‌ నిర్వహణ కింద రూ.34.31 కోట్లను 2025 మే 7న చెల్లించిందని, అయితే, స్టేజ్‌-1 అనుమతుల్లో భాగంగా విధించిన జరిమానాను మాత్రం ఇంకా చెల్లించలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు కాంపా (కాంపెన్సటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ) నిధులు రూ.3,852.61 కోట్లు ఇప్పటివరకు విడుదల చేసినట్లు కేంద్రం స్పష్టంచేసింది. కాంగ్రెస్‌ ఎంపీ ఆర్‌.రఘురాంరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్‌సింగ్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు. అటవీ భూములను అటవీయేతర అవసరాలకు మళ్లించినప్పుడు జరిగే పర్యావరణ నష్టాన్ని పూడ్చడానికి, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం ఈ నిధులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇటు వరంగల్‌ విమానాశ్రయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులు ముందుకు సాగాలంటే తెలంగాణ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు 253 ఎకరాల భూమిని అప్పగించాలని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రశ్నకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మొహోల్‌ సమాధానమిచ్చారు.

Updated Date - Dec 09 , 2025 | 03:25 AM