RRR project: ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం నిర్మాణానికి కేంద్రం ఓకే!
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:06 AM
రీజినల్ రింగు రోడ్డు ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం నిర్మాణ విషయంపై స్పష్టత వచ్చింది! రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఈ మార్గాన్నీ నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది...
రాష్ట్రం ఖరారు చేసిన అలైన్‌మెంట్ పరిశీలించాక..మోర్త్ పరిధిలో నిర్మించాలన్నయోచనలో కేంద్రం
9న ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం
సీఎం రేవంత్ సమీక్షలోనూ కేంద్ర అధికారుల వెల్లడి
201 కి.మీ. అలైన్‌మెంట్‌ను సమర్పించనున్న సర్కారు
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం నిర్మాణ విషయంపై స్పష్టత వచ్చింది! రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఈ మార్గాన్నీ నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన అలైన్‌మెంట్‌ను మరోసారి పరిశీలించాలని భావిస్తోంది. ఆ తర్వాత దక్షిణ భాగాన్ని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ (మోర్త్) పరిధిలో చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయాన్ని తాజాగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో కేంద్ర ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఢిల్లీ అధికారులు సీఎం రేవంత్‌కు తెలిపారు. అంటే ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించనుంది. ప్రస్తుతం ఉత్తర భాగం నిర్మాణాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలో చేపడుతున్నారు. దక్షిణ భాగాన్ని మోర్త్ పరిధిలో చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిన 201 కిలోమీటర్ల దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను కేంద్రానికి సమర్పించగా.. తాజాగా మరోసారి పూర్తి వివరాలతో కూడిన అలైన్‌మెంట్‌ను నివేదించనున్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత ఈ మార్గాన్ని మోర్త్, ఎన్‌హెచ్‌ఏఐల్లో దేని పరిధిలో చేపట్టాలనేదానిపై స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసింది. భూముల సేకరణకు సహకరించడంతో పాటు చెల్లించాల్సిన పరిహారంలో రాష్ట్ర వాటాగా 50 శాతం ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే కేంద్రం దక్షిణ భాగం రహదారిని నిర్మించేందుకు సమ్మతించినట్లు సమాచారం. అయితే ఈ రహదారి మంజూరైన సమయంలో ప్రాథమిక అలైన్‌మెంట్ ప్రకారం 189 కి.మీ. దూరం ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అలైన్‌మెంట్ ప్రకారం 11 కి.మీ. పెరిగి 201 కి.మీ.కు చేరింది. దాని ప్రకారమే రహదారిని నిర్మించాలంటూ కేంద్రాన్ని కోరుతోంది. అంతేకాకుండా ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగానికి అవసరమైన భూములనూ సేకరిస్తే ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, నిర్మాణ వ్యయంలోనూ మార్పులుండవని తెలిపింది.
దక్షిణ భాగం అలైన్‌మెంట్ ఇలా..
దక్షిణ భాగం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు రకాల అలైన్‌మెంట్లను రూపొందించింది. మొదటి ప్రతిపాదన 189.5 కి.మీ., రెండోది 201 కి.మీ., మూడోది 218 కి.మీ.గా ఉంది. మొదటి ప్రతిపాదనలో 96 శాతం వ్యవసాయ భూమి, 3 శాతం నిర్మాణాలు ఉండగా.. మూడో దాంట్లోనూ అంతే ఉన్నాయి. రెండో ప్రతిపాదనలో 99ు వ్యవసాయ భూములు, ఒక శాతం నిర్మాణాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలో అటవీ భూములు లేవు. మొదటి, మూడో ప్రతిపాదనకు వెళితే అటవీ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నందున.. రాష్ట్ర మంత్రివర్గం రెండో ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇందులో కేవలం పర్యావరణ అనుమతులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. రెండో అలైన్‌మెంట్‌లో 2,010 హెక్టార్ల భూమి అవసరం ఉంటుందని, 55 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని తేల్చారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమలతోపాటు కొత్త వాటిని అనుసంధానించవచ్చని భావించిన ప్రభుత్వం రెండో అలైన్‌మెంట్‌ను ఆమోదించింది. ఈ మార్గంలో నాలుగు జాతీయ రహదారులు, ఒక రాష్ట్ర రహదారి అనుసంధానం కానుంది. చౌటుప్పల్ దగ్గర ప్రారంభమయ్యే ఈ రోడ్డు ఆమనగల్, చేవెళ్ల, వికారాబాద్ మీదుగా సంగారెడ్డి వరకు మొత్తం 201 కి.మీ. ఉండనుంది. దాదాపు 16 గ్రామాలపై ప్రభావం పడనుంది. ఫ్యూచర్‌సిటీ, ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగు రోడ్డు, బెంగళూరు హైవేలన్నీ ఈ మార్గంలోనే అధిక భాగం ఉండడంతో ఈ రోడ్డుపై వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు అధికంగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. భూ పరిహారం చెల్లింపులు, నిర్మాణం కోసం దాదాపు 16 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా.
అలైన్‌మెంట్‌పై వివాదాలిలా..
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాల్లో భూసేకరణపై, దక్షిణ భాగంలో కొన్ని ప్రాంతాల్లో అలైన్‌మెంట్‌పై కొంత వివాదం జరిగింది. ఉత్తర భాగంలో చౌటుప్పల్ దగ్గర అధికంగా భూములు కోల్పోవాల్సి వస్తోందని, పరిహారం చాలా తక్కువగా ఉందని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దక్షిణ భాగం విషయంలోనూ చౌటుప్పల్ నుంచి కొద్దిగా ముందుకువెళ్లిన తర్వాత అలైన్‌మెంట్ మారిందని, కొంతమంది ప్రయోజనం కోసమే అలా చేశారంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల దక్షిణ భాగానికి సంబంధించి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత ఆ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. అలైన్‌మెంట్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.