Flood Damage in Kamareddy District: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:57 AM
కామారెడ్డి జిల్లాలో నెల రోజుల క్రితం భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు వేల ఎకరాల్లో వివిధ...
కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటన
కామారెడ్డి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలో నెల రోజుల క్రితం భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. కేంద్ర అధికారులు పీకే రాయ్, మహేశ్ కుమార్, శ్రీనివాసు బైరి, శశివర్ధన్‌రెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. మొదట భిక్కనూర్ మండల కేంద్రానికి చేరుకుని అక్కడ దెబ్బతిన్న దాసమ్మకుంటను పరిశీలించి, అంతంపల్లి రోడ్డులో దెబ్బతిన్న పంచాయతీ రోడ్డు, పంట పొలాలను పరిశీలించారు. అనంతరం బీబీపేట్‌లో వరదలకు కోతలకు గురైన ఆర్‌అండ్‌బీ బ్రిడ్జి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీ వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని, అధిక వర్షాలతో దెబ్బతిన్న కామారెడ్డి ఫిల్టర్ బెడ్ పంప్‌హౌస్ క్యాజ్‌వే రోడ్డును పరిశీలించారు. తర్వాత వరద నష్టంపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని వారు తెలిపారు.