Central Govt: తలసీమియా బాలలకు రూ.10 లక్షలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:56 AM
తలసీమియా బాల సేవా యోజన ద్వారా బాధిత చిన్నారులకు రూ.10 లక్షల సాయం అందజేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటిదాకా 800 మందికి బీఎంటీ చికిత్స: కిషన్‌రెడ్డి
బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స కోసం కోల్ ఇండియా-రెయిన్ బో ఆస్పత్రి ఒప్పందం
హైదరాబాద్ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తలసీమియా బాల సేవా యోజన ద్వారా బాధిత చిన్నారులకు రూ.10 లక్షల సాయం అందజేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం కింద బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్(బీఎంటీ) చికిత్స అందించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కోల్ ఇండియా లిమిటెడ్(సీఐఎల్), రెయిన్ బో చిల్డ్రన్స్ ఫౌండేషన్‌లు శనివారం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. రెయిన్ బో ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దినేష్ చిర్ల, సీఐఎల్ చైర్మన్ సనోజ్ కుమార్ ఝా, డైరెక్టర్(హెచ్‌ఆర్) డాక్టర్ వినయ్ రంజన్ తదితరులు ఈ కార్యక్రమలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు 17 ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నామని, ఇప్పుడు రెయిన్‌బోతో అవగాహన కుదిరిందని చెప్పారు. ఇప్పటిదాకా దాదాపు 800 మంది పిల్లలకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరిగాయని తెలిపారు.