Share News

BC Reservation: బీసీ బిల్లుకు కేంద్రం అడ్డు

ABN , Publish Date - Sep 08 , 2025 | 02:45 AM

గవర్నర్‌ వద్ద బీసీ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు...

BC Reservation: బీసీ బిల్లుకు కేంద్రం అడ్డు

  • కేసీఆర్‌ కుటుంబమంతా దొంగల ముఠానే

  • ఆయన పిలిస్తే కవిత వెళ్లదా?: మహేశ్‌గౌడ్‌

  • విపక్షాల కుట్రలు వెల్లడిస్తాం: పొంగులేటి

  • బీసీల కోసం రాహుల్‌ పోరాటం: సీతక్క

  • కేంద్రం మెడలు వంచుతాం: సురేఖ

కామారెడ్డి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ వద్ద బీసీ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రం తలచుకుంటే ఒక్క రోజులోనే రిజర్వేషన్లపై చట్టం తీసుకురావచ్చని.. కానీ కాంగ్రె్‌సకు ఎక్కడ పేరు వస్తుందోననే భయంతో అడ్డుకుంటోందన్నారు. కామారెడ్డిలో ఈ నెల 15న నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్‌ విజయోత్సవ సభ సన్నాహక సమావేశం ఆదివారం కామారెడ్డిలోని శుభం కన్వెన్షన్‌లో జరిగింది. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌.. ప్రధాని మోదీ, అమిత్‌షాలను ఒప్పించకపోవడం సిగ్గు చేటన్నారు. బీసీ బిడ్డలైన సంజయ్‌, ఎంపీ అర్వింద్‌ బిల్లుపై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. గతంలో తాను చేసిన దేశ్‌ముఖ్‌ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. తాను సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యకు వస్తాన ని.. బండి సంజయ్‌కి ఆ దమ్ముందా..? అని సవాల్‌ విసిరారు. రిజర్వేషన్లపై బీజేపీ బాగోతం బయటపెట్టడానికే కామారెడ్డిలో సభను నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారని తెలిపారు. 2లక్షల మందితో కేంద్రం కనువిప్పు కలిగేలా, బీసీల భవిష్యత్తు మలుపు తిప్పే విధంగా సభ ఉంటుందన్నా రు. దోచుకున్న సొమ్ము వాటాల పంపిణీలో తేడా వచ్చి.. కేసీఆర్‌ కుటుంబం బజారున పడి కొట్టుకుంటోందన్నారు. కాళేశ్వరం అవినీతిని కవితనే బయటపెట్టిందని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబమంతా దొంగల ముఠా అని, కేసీఆర్‌ పిలిస్తే మళ్లీ కవిత వెళ్లదా..? అని ఆయన ప్రశ్నించారు.


కామారెడ్డి సభతో బుద్ధి చెప్పాలి: పొన్నం

కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కేంద్రానికి బుద్ధి చెప్పేలా కామారెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాల కారుకూతలు, కుట్రలను బయటపెట్టేందుకే కామారెడ్డిలో విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతిలో కులగణను విజయవంతం చేసి దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు. కామారెడ్డి సభకు 2 లక్షల మందికి తగ్గకుండా తరలించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలను కోరారు. రాహుల్‌, రేవంత్‌రెడ్డి.. అగ్రవర్ణాలకు చెందినప్పటికీ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. బీసీల జనాభా ప్రకారం ఆ వర్గాలకు కాం గ్రె్‌సలో నామినేటెడ్‌ పదవులను కేటాయించామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ కచ్చితంగా నెరవేరుస్తుందన్నారు. కేంద్రం బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించకపోతే పోరాటం చేస్తామని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. కామారెడ్డి వేదికగా సమరభేరి మోగించి కేంద్రం మెడలు వంచుతామన్నారు. అంతకుముందు బీసీ విజయోత్సవ సభ నిర్వహించే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్టేడియాన్ని మంత్రులు పరిశీలించారు.

Updated Date - Sep 08 , 2025 | 02:45 AM