New Medical Seats Across India: దేశవ్యాప్తంగా కొత్తగా 10,023 మెడికల్ సీట్లు
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:08 AM
వైద్య విద్యకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో కొత్తగా 10,023 యూజీ, పీజీ వైద్య విద్య సీట్లను మంజూరు చేసింది...
ఇందులో ఎంబీబీఎస్ సీట్లు 5,023.. పీజీ సీట్లు 5వేలు
ప్రభుత్వ కాలేజీల్లో మంజూరుకు కేంద్రం నిర్ణయం
రూ.15,034కోట్ల ఖర్చు.. రాష్ట్రాల వాటా రూ.4,731కోట్లు
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో కొత్తగా 10,023 యూజీ, పీజీ వైద్య విద్య సీట్లను మంజూరు చేసింది. బుధవారం జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా మంజూరైన సీట్లలో 5,023 ఎంబీబీఎస్ సీట్లు, 5000 పీజీ సీట్లు ఉన్నాయి. 2028-29 నాటికి ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. ఈ సీట్లను అందుబాటులోకి తీసుకురావడానికి మొత్తం రూ.15,034.50 కోట్ల వ్యయం కానుండగా ఇందులో కేంద్రం వాటా రూ.10,303.20 కోట్లు. రాష్ట్రాల వాటా రూ.4,731.30 కోట్లు. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్లు వ్యయం చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో 808 మెడికల్ కాలేజీలున్నాయి. ఇందులో 1,23,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు ఇండియాలోనే ఉన్నాయని కేంద్రం పేర్కొంది. గడిచిన పదేళ్లలో కొత్తగా 69,352 యూజీ, 43,041 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. అయినప్పటికీ దేశంలో డాక్టర్ల కొరత ఉన్నందున వైద్య సీట్ల పెంపు అనివార్యమైందని వివరించింది. ఏటా దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తున్నారు. మెడికల్ సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో చాలా మంది వైద్య విద్యను అభ్యసించలేని పరిస్థితి నెలకొంది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వైద్య విద్యలో ప్రవేశం పొందే అవకాశం విద్యార్థులకు ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఎక్కువ మంది వైద్యులు అందుబాటులోకి వస్తారు. అలాగే స్పెషలిస్ట్ డాక్టర్ల లభ్యత పెరుగుతుంది. సర్కారీ దవాఖానాల్లో కొత్త స్పెషాలిటీ సేవలు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.
మనకు పీజీ సీట్లే!
కేంద్రం ప్రకటించిన కొత్త యూజీ, పీజీ సీట్లలో తెలంగాణ కేవలం పీజీ సీట్లనే ఎంచుకోనుందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జిల్లాకొక మెడికల్ కాలేజీ ఉందని, రాష్ట్రానికి పీజీ సీట్లు అవసరమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త యూజీ, పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ వచ్చే నెలలో దరఖాస్తులు కోరే అవకాశం ఉందని, అప్పుడు రాష్ట్రం పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేస్తుందని వివరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలుండటంతో 200-300 పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉందని వైద్యవిద్య సంచాలక కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.