Share News

Minister Sridhar Babu: తెలంగాణపై కేంద్రం కక్ష కట్టింది

ABN , Publish Date - Sep 28 , 2025 | 02:36 AM

తెలంగాణకు వచ్చే కంపెనీలకు అనుమతినిచ్చే విషయంలో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు..

Minister Sridhar Babu: తెలంగాణపై కేంద్రం కక్ష కట్టింది

  • పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు పంపుతోంది: దుద్దిళ్ల

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు వచ్చే కంపెనీలకు అనుమతినిచ్చే విషయంలో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాకుండా వివక్ష చూపుతోందని ఆరోపించారు. తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ (టీటా) ఆధ్వర్యంలో శనివారం హైటెక్‌ సిటీలో నిర్వహించిన ‘పిచ్‌ టు ప్రెస్‌’లో ఆయన పాల్గొన్నారు. వినూత్న ఆవిష్కరణలతో ఆకట్టుకున్న స్టార్టప్‌ కంపెనీలకు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘ ఇటీవలే ఓ ప్రముఖ సెమీ కండక్టర్ల కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైంది. వారు కోరిన విధంగా భూముల కేటాయింపునకూ ప్రభుత్వం అనుమతించింది. ఇలా అన్ని అర్హతలున్న రాష్ట్రాన్ని విస్మరించి.. ఆ కంపెనీని బీజేపీ పాలిత ప్రాంతం అసోంలో పెట్టేలా కేంద్రం ప్రోత్సహించింది. ఇలాగే, మరో చిప్‌ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైతే.. కేంద్రంలో బీజేపీకి మద్దతుగా ఉన్నందున ఏపీకీ ఆ ప్రాజెక్టు కేటాయించింది’’అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని అనుకూలతలు తెలంగాణకు ఉన్నాయని, ఇక్కడి పారిశ్రామిక విధానాలతో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి మంత్రి మెట్రోలో ప్రయాణించి వచ్చారు. ఎల్బీనగర్‌ నుంచి రాయదుర్గం వరకు రోడ్డు మార్గంలో రావాలంటే.. 3 గంటల సమయం పడుతుందని, మెట్రోలో మాత్రం ఎలాంటి సమస్య లేకుండా వేగంగా వచ్చేశానని శ్రీధర్‌బాబు అన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 02:36 AM