Share News

CM Revanth Reddy: సత్యసాయి.. ప్రజల్లో దేవుడిని చూసినమహానుభావుడు

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:39 AM

భగవాన్‌ సత్యసాయి ప్రజల్లోనే దేవుడిని చూశారని, ప్రేమ ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందనేది ఆయన సందేశమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు....

CM Revanth Reddy: సత్యసాయి.. ప్రజల్లో దేవుడిని చూసినమహానుభావుడు

  • తెలంగాణలోనూ అధికారికంగా శతజయంతి ఉత్సవాలు

  • బాబా ట్రస్టు కార్యక్రమాలకు తోడ్పడతాం: సీఎం రేవంత్‌

  • నిస్వార్థ సేవలకు ప్రతిరూపం: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌

  • పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు

అనంతపురం/పుట్టపర్తి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): భగవాన్‌ సత్యసాయి ప్రజల్లోనే దేవుడిని చూశారని, ప్రేమ ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందనేది ఆయన సందేశమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బాబా సందేశం యుగయుగాలపాటు ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణలోనూ సాయిబాబా శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బాబా సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు, ఆయన సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేరవేయడానికి తమ ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్‌వ్యూ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయి శతజయంత్యుత్సవాల్లో రేవంత్‌ ప్రసంగించారు. ‘‘తన సేవలతో ప్రజలలో సత్యసాయి దేవుడయ్యారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడం ద్వారా ట్రస్టు లక్షలాది మంది జీవితాలకు వెలుగునిచ్చింది. ప్రభుత్వాలకు సరితూగే స్థాయిలో, కొన్ని సందర్భాల్లో అంతకుమించి సేవలు అందిస్తోంది. ప్రభుత్వ వైద్య సేవలు అందని ప్రాంతాల్లో బాబా ఆస్పత్రులు అనేక మందికి ప్రాణదానం చేస్తున్నాయి. తెలంగాణలోని పాలమూరు, ఏపీలో అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతాల్లో ప్రభుత్వాలు పరిష్కరించలేని తాగునీటి సమస్యను బాబా ట్రస్టు పరిష్కరించింది. అందుకే సత్యసాయి ప్రాణమిచ్చే దేవుడి స్థానాన్ని పొందారు’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. శాంతి, ప్రేమ, నిస్వార్థ సేవలకు భగవాన్‌ సత్యసాయిబాబా ప్రతిరూపమని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. ఆయన బోధనలు.. ‘అందరినీ ప్రేమించు-అందరినీ సేవించు, ఎల్లప్పుడూ సాయపడు, ఎన్నటికీ బాధించకు’ వంటివి విశ్వవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. 1964-65 మధ్య తన కుటుంబానికి సత్యసాయి ఆశీస్సులు అందాయని.. తమిళం మాత్రమే తెలిసిన తన అత్తయ్య ఒంటరిగా పుట్టపర్తికి వచ్చి, 15 రోజులు ఇక్కడ ఉండి బాబా ఆశీస్సుల అందుకోవడం దైవిక శక్తికి నిదర్శనమని గుర్తు చేసుకున్నారు. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు దేశవ్యాప్తంగా అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సంఘర్షణలు, ఒత్తిళ్లతో నిండిన నేటి ప్రపంచానికి ఆయన బోధించిన ప్రేమ, ఐక్యత, సేవ వంటి విలువలు మరింత అవసరమన్నారు. కాగా, మానవ విలువల వికాసానికి సత్యసాయి అందించిన సేవలు అపూర్వమని త్రిపుర గవర్నర్‌ ఎన్‌.ఇంద్రసేనారెడ్డి కొనియాడారు. మానవత్వం, దైవత్వం మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు సత్యసాయి ట్రస్టును ఏర్పాటు చేయడం బాబా తీసుకున్న దైవ నిర్ణయమని చెప్పారు. ఆయన శత జయంత్యుత్సవాలు భావి తరాలకు సేవామార్గంలో పునఃసమర్పణగా నిలవాలని ఆకాంక్షించారు.


లక్ష్యం కోసం అవతరించిన మహోన్నతుడు

ప్రజలకు జ్ఞానాన్ని బోధించి, సన్మార్గం చూపే లక్ష్యంతో అవతరించిన మహోన్నతుడు సత్యసాయిబాబా అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ‘‘సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో కోట్ల మంది జీవితాలను బాబా ప్రభావితం చేశారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని ఆయన కోరుకున్నారు. భగవాన్‌ మనో దర్శనం ద్వారా దేశ, విదేశాల నుంచి సంపన్నులు, ప్రముఖులు వచ్చి ఆయన సేవా మార్గాన్ని అనుసరించారు. ఎక్కడా లేని ప్రశాంతతను పుట్టపర్తిలో పొందారు’’ అని పేర్కొన్నారు. ఇక ప్రేమ, అహింస, సత్యం, ధర్మం, శాంతి ప్రతి మనిషి జీవిత పరమార్థమని సత్యసాయి బోధించారని.. భగవాన్‌ శతజయంత్యుత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని మంత్రి లోకేశ్‌ చెప్పారు.

సర్వం.. సాయి స్మరణ

పుట్టపర్తి: ‘సత్యమే యథార్థం. అదే నా తత్వం. నాపేరు కూడా సత్యం. నా ప్రచారమే సత్యం. నేనే సత్యం..’ అని ప్రకటించుకున్న పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్ర ప్రభుత్వం, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు, ప్రముఖులు తరలివచ్చారు. వేడుకలలో చివరి రోజు, సత్యసాయి జయంతి అయిన ఆదివారం పుట్టపర్తిలోని హిల్‌ వ్యూ స్టేడియం ఉదయం ఏడు గంటలకే భక్తజనంతో నిండిపోయింది. నిర్మల, నిస్వార్థ సేవ, ప్రేమను పంచిన సత్యసాయికి జయము జయము అని భక్తులు స్మరించుకున్నారు. శాంతి వేదిక వద్దకు చేరుకున్న స్వర్ణ రథానికి సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ మంగళహారతి ఇచ్చారు. అనంతరం వేదికపై సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్‌జే రత్నాకర్‌ అతిథులకు స్వాగతం పలికారు. శత జయంతి వేడుకలలో రెండు రోజులపాటు పాల్గొన్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ సత్కరించారు. భగవాన్‌ సత్యసాయి బాబా ప్రారంభించిన సత్యసాయి మిషన్‌కు భక్తులే మూలస్తంభాలు అని అన్నారు. వేడుకలకు హాజరైన ఉప రాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా వీవీఐపీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Nov 24 , 2025 | 06:32 AM