CM Revanth Reddy : పర్యావరణానికి హాని కలిగించకుండా పండుగ జరుపుకోవాలి
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:42 AM
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని...
రాష్ట్ర ప్రజలకు సీఎం దీపావళి శుభాకాంక్షలు
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి: మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్ర ప్రజలు సిరి సంపదలతో వర్ధిల్లాలి: మంత్రి తుమ్మల
హైదరాబాద్/ఖమ్మం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తమ జీవితాల్లో ప్రజాప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చిందని అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. దీపాల కాంతులతో ప్రతీ ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. తెలంగాణ ప్రజలు, రైతులు సిరి సంపదలతో వర్ధిల్లాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. దీపావళి పండుగ నుంచే రైతులకు పంట చేతికి వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిమనిషికి తనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని, జ్ఞానపు ఉషస్సులను వెలిగించుకోవాలనే స్ఫూర్తిని దీపావళి పర్వదినం అందిస్తుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో కమ్ముకున్న చీకట్లు తొలగి, ఆనందపు వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్న రాంచందర్‌రావు ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.