Share News

Three Rejection Grounds for Sadabainama: సాదాబైనామా తిరస్కరణకు 3 కారణాలు

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:11 AM

ఎటువంటి కారణాలు ఉంటే సాదాబైనామాలను తిరస్కరించవచ్చునో తెలియజేస్తూ క్షేత్రస్థాయి అధికారులకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌...

Three Rejection Grounds for Sadabainama: సాదాబైనామా తిరస్కరణకు 3 కారణాలు

  • సర్క్యులర్‌ జారీ చేసిన సీసీఎల్‌ఏ

  • ఉన్నతాధికారుల్లో అయోమయం

  • క్షేత్రస్థాయిలో 15 కారణాలున్నట్లు గుర్తింపు

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్ర జ్యోతి): ఎటువంటి కారణాలు ఉంటే సాదాబైనామాలను తిరస్కరించవచ్చునో తెలియజేస్తూ క్షేత్రస్థాయి అధికారులకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) కార్యాలయం రెండు రోజుల క్రితం ఒక సర్క్యులర్‌ పంపింది. దాని ప్రకారం.. దరఖాస్తుదారు ఆధీనంలో భూమి లేకపోయినా, అఫిడవిట్‌ ఇవ్వకపోయినా, డిమాండ్‌ నోటీసు పంపిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లించకున్నా.. ఇచ్చిన ఫార్మాట్‌ ప్రకారం.. ఈ మూడు కారణాలను నమోదు చేయాలని పేర్కొంది. అయితే, ఈ సర్క్యులర్‌ అధికారులను గందరగోళానికి గురిచేసింది. క్షేత్రస్థాయిలో సుమారు 15 కారణాలుంటే.. కేవలం మూడింటినే ప్రస్తావించడం అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లలో చర్చకు దారితీసింది. ఒకవైపు సాదాబైనామా దరఖాస్తుల విషయంలో అఫిడవిట్‌ తప్పనిసరి కాదని, గ్రామ స్థాయిలో విచారణ చేసి నిర్ధారణ చేయాలని చెప్పిన ఉన్నతాధికారులు.. తిరస్కరణకు చూపిన కారణాల్లో అఫిడవిట్‌ కూడా చేర్చడంతో అధికారులు విస్తుపోతున్నారు. అఫిడవిట్‌ తప్పనిసరి కాదని గతంలో ఉన్నతాధికారులు చెప్పినా.. చాలా మంది తహసీల్దార్లు అఫిడవిట్‌ లేదనే సాకుతో అనేక దరఖాస్తులను పక్కన పెట్టారని తెలుస్తోంది. సీసీఎల్‌ఏ పంపిన సర్క్యులర్‌లో మూడు కారణాలే చూపినా.. క్షేత్రస్థాయి అధికారులు 15 కారణాలున్నాయని అంటున్నారు. దరఖాస్తుదారు ఆధీనంలో భూమి లేకపోవడం, అఫిడవిట్‌ తీసుకురాలేకపోవడం, స్టాంప్‌ డ్యూటీ చెల్లించకపోవడం, పహానీలో విక్రయించిన వ్యక్తి పేరు లేకపోవడం, సర్వే నంబరు మునిసిపల్‌ పరిధిలో ఉండటం, ప్రభుత్వ భూమి, సీలింగ్‌ క్యాటగిరీ.. వక్ఫ్‌, దేవాదాయ, భూదాన్‌ క్యాటగిరీలో ఉండటం, 2-6-2014 తర్వాత సాదాబైనామా విక్రయాలు, ఇప్పటికే భూ భారతిలో నమోదై ఉండటం, వ్యవసాయేతర భూమిగా ఉండటం, ఇంటి పట్టా.. కొనుగోలుదారు చిన్న, సన్నకారు రైతుల క్యాటగిరీలో లేకపోవడం, కోర్టు వివాదాలు ఉండటం వంటివి ఉన్నాయని పేర్కొంటున్నారు. దరఖాస్తు తిరస్కరణకు ఇవన్నీ కారణాలుగా తెలిపేందుకు కొత్త ఫార్మాట్‌ను తామే తయారు చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.


అరకొరగానే పరిష్కారం..

సీసీఎల్‌ఏ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 9,00,880 సాదాబైనామా దరఖాస్తులున్నాయి. దీనికి సంబంధించి 11,49,316 సర్వే నంబర్లున్నాయి. వీటిలో 9,00,295 మందికి నోటీసులు పంపారు. మొత్తం దరఖాస్తుల్లో తహసీల్దార్‌ నుంచి ఆర్డీవోకు పంపినవి 4,63,412. అందులో ఆమోదించిన సర్వే నంబర్లు కేవలం 44. తిరస్కరించిన సర్వే నంబర్లు 1,39,713. సూర్యాపేట జిల్లాలో 81,626 సాదాబైనా దరఖాస్తులు ఉండగా, అందులో 55,956 దరఖాస్తులను తహసీల్దార్‌ లాగిన్‌ నుంచి ఆర్డీవో లాగిన్‌కు పంపారు. వాటిలో ఆమోదించినవి ఒకటి మాత్రమే. ఖమ్మంలో 1,11,442 దరఖాస్తులు ఉంటే తహసీల్దార్‌ నుంచి ఆర్డీవోకి వెళ్లినవి 58,596. ఇందులో నేటి వరకు ఒక్కటి కూడా ఆమోదించలేదు. రంగారెడ్డి, హనుమకొండ, మహబూబాబాద్‌, గద్వాల, భద్రాది కొత్తగూడెం, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మంచిర్యాల, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్‌, సిరిసిల్ల, వరంగల్‌, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, నాగర్‌కర్నూల్‌, ములుగు, సిద్దిపేట, వనపర్తి, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తహసీల్దార్‌ నుంచి ఆర్డీవో లాగిన్‌కు వెళ్లిన దరఖాస్తుల్లో ఒక్కటీ ఆమోదం పొందలేదు. జనగామలో2 ,కరీంనగర్‌-5, నిజామాబాద్‌-12, జగిత్యాల-3, నల్లగొండ-7, మెదక్‌-9, భూపాలపల్లి-2 నారాయణపేటలో ఒక దరఖాస్తు ఇప్పటి వరకు ఆమోదం పొందాయి.

Updated Date - Nov 25 , 2025 | 04:11 AM