Share News

Lapses in Prison Surveillance: జైళ్లల్లో నిఘా లోపం!

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:51 AM

కరుడుగట్టిన నేరగాళ్లు, సంఘ విద్రోహులు రిమాండ్‌ ఖైదీలుగా ఉండే జైళ్లలో నిఘా వ్యవస పటిష్ఠంగా ఉండాలి. నేరస్థుల ప్రతి కదలికను గమనించేలా భద్రతా ఏర్పాట్లు ఉండాలి...

Lapses in Prison Surveillance: జైళ్లల్లో నిఘా లోపం!

  • సీసీ కెమెరాలున్నా నిరుపయోగం

  • కంట్రోల్‌ రూంలో సరిపోను మానిటర్లూ లేవు

  • పెట్రోల్‌ బంకులు, ఔటలెట్‌లల్లో పనిచేసేవారిపై నిఘా కరువు

హైదరాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): కరుడుగట్టిన నేరగాళ్లు, సంఘ విద్రోహులు రిమాండ్‌ ఖైదీలుగా ఉండే జైళ్లలో నిఘా వ్యవస పటిష్ఠంగా ఉండాలి. నేరస్థుల ప్రతి కదలికను గమనించేలా భద్రతా ఏర్పాట్లు ఉండాలి. కానీ రాష్ట్ర జైళ్లల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. నిఘాలోపాన్ని ఆసరాగా చేసుకుని ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకుని పారిపోవడం, పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఓ ఖైదీ పట్టపగలు జైలు సిబ్బంది కళ్లుగప్పి జైలు గోడ దూకి తప్పించుకుని పారిపోయాడు. జైలుకు వచ్చిన కేవలం రోజుల వ్యవధిలోనే భద్రతా లోపాలు, లోటుపాట్లు గుర్తించిన ఖైదీ పరిస్థితులు అనుకూలంగా మార్చుకుని తప్పించుకున్నాడు. ఖైదీ పారిపోయిన విషయం తీరిగ్గా గుర్తించిన జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పారిపోయిన ఖైదీని వెతికి పట్టుకొచ్చారు. ఈ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే అదే జైల్లో మరో ఖైదీ కనిపించకుండా పోవడం జైలు అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. అయితే జైలు ఆవరణ మొత్తం వెతికే క్రమంలో నిరుపయోగంగా ఉన్న ఓ భవనంలో ఖైదీ తీరిగ్గా పడుకుని ఉండటం గుర్తించి అంతా ఊపిరి పీల్చుకున్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఇలాంటి వరుస ఘటనలు కేవలం అక్కడి భద్రతనే కాదు.. రాష్ట్ర జైళ్ల శాఖ పనితీరు కూడా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా నిఘా లోపా న్ని ఆసరాగా చేసుకుని ఖైదీలు తప్పించుకుని పారిపోవడం కొత్తేమీ కాదు. గతంలో కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని సబ్‌ జైలు నుంచి రాజేశ్‌ అనే ఖైదీ తప్పించుకుని పారిపోయాడు. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రాజేశ్‌ జైలు ఆవరణలో పనిచేస్తున్న సమయంలో జైలు సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకునిపారిపోయాడు. మరో ఘటనలో వరంగల్‌ జిల్లాలోని పరకాల సబ్‌ జైలు నుంచి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న మహమ్మద్‌ పాషా తప్పించుకున్నాడు. నిఘా లోపం, సిబ్బంది నిర్లక్ష్యాన్ని గుర్తించిన పాషా జైలు ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని చెత్త బయట పడేసే నెపంతో తప్పించుకుని పారిపోయాడు.


సీసీ కెమెరాల నిర్వహణ కరువు!

జైళ్లల్లో సీసీ కెమెరాలు కేవలం అలంకారప్రాయంగా మారాయి. చర్లపల్లి కేంద్ర కారాగారంలో సుమారు 200లకుపైగా సీసీ కెమెరాలు ఉన్నట్లు సమాచారం. వాటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినా.. కేవలం 9 మానిటర్లు మాత్రమే ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. కంట్రోల్‌ రూంలో సిబ్బందికి సైతం సాంకేతికంగా పెద్దగా పరిజ్ఞానం లేకపోవడంతో అక్కడ అలంకారప్రాయంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఖైదీ పారిపోయిన సమయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ లోపం బయటపడింది. ఒక్క చర్లపల్లిలోనే కాదు.. అన్ని కేంద్ర, జిల్లా కారాగారాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సీసీ కెమెరాలు అమర్చిన ఏజెన్సీల గడువు ముగియడంతో వారు నిర్వహణ పట్టించుకోవడం లేదు. మరోవైపు.. తెలంగాణ జైళ్ల శాఖ.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సహకారంతో హైదరాబాద్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లోనూ పెట్రోల్‌ బంకులను నిర్వహిస్తోంది. జైళ్లల్లో ఖైదీలు తయారు చేసే వస్తువుల్ని ‘మై నేషన్‌ బ్రాండ్‌’తో జైళ్ల వద్ద ఔట్‌ లెట్‌లల్లో విక్రయిస్తున్నారు. పెట్రోల్‌ బంకులు, ఔట్‌లెట్‌లల్లోనూ ఖైదీల తో పనిచేయిస్తుంటారు. ఖైదీలు పనిచేసేటప్పుడు, షిఫ్టులు మారే సమయంలో సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయే అవకాశం లేకపోలేదు.

సిబ్బంది కేటాయింపుల్లోనూ అసమానతలు

రాష్ట్రవ్యాప్తంగా జైళ్లల్లో సిబ్బంది కేటాయింపుల్లో తీవ్ర అసమానతలు ఉన్నాయి. చర్లపల్లి కేంద్ర కారాగారంలో 140 మంది సిబ్బంది ఉండాలి.. కానీ అక్కడ సగానికిపైగా ఖాళీలు ఉన్నాయి. కరీంనగర్‌ జైల్లో 300 మంది ఖైదీలు ఉంటే 70 మంది వరకు సిబ్బంది ఉన్నారు. సంగారెడ్డి, నిజామాబాద్‌ కేంద్ర కారాగారాల్లోనూ సరిపడ సిబ్బంది లేరు. వరంగల్‌ జైలుకు సంబంధించి 60 మందికిపైగా సిబ్బంది అవసరం కాగా కేవలం 20 మంది వరకే ఉన్నట్లు సమాచారం. నల్లగొండ, భువనగిరి జైళ్లల్లోనూ పది మందికిపైగా సిబ్బంది అవసరం కాగా కేవలం 5, 6 మంది మాత్రమే ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్ర, జిల్లా కారాగారాల్లో సిబ్బంది కేటాయింపులు సరిగా లేకపోవడంతో ఒక జైల్లో పరిమితికి మించి ఉంటే.. మరో జైల్లో అవసరమైన దానికంటే సగం మందే అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు.

Updated Date - Oct 09 , 2025 | 05:51 AM