Kaleshwaram Project Scam: కాళేశ్వరంపై రంగంలోకి సీబీఐ
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:06 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తిని అందుకున్న సీబీఐ ఈ అంశంపై ప్రాథమిక ఆధారాలు సేకరించడం ప్రారంభించింది.
ఎన్‌డీఎస్ఏ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఘోష్ కమిషన్ దర్యాప్తు నివేదికలివ్వండి
సీఎస్‌కు సీబీఐ అధికారుల లేఖ
నివేదికలు పరిశీలించాకే న్యాయ సలహా మేరకు ప్రాథమిక దర్యాప్తు
ఐఏఎస్‌ల పాత్ర ఉన్నందున కేంద్రం అనుమతి తప్పనిసరి
కేసీఆర్, హరీశ్‌ల కోసం గవర్నర్ అనుమతి
అన్నీ వచ్చాకే పూర్తి స్థాయి దర్యాప్తు
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తిని అందుకున్న సీబీఐ ఈ అంశంపై ప్రాథమిక ఆధారాలు సేకరించడం ప్రారంభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో సీబీఐకి లేఖ రాసింది. తెలంగాణకు సంబంధించి సీబీఐ కేసుల నమోదుకు అనుమతి నిరాకరిస్తూగతంలో కేసీఆర్ ప్రభుత్వం జీవో నంబర్ 51 ఇచ్చింది. ఒక్క కాళేశ్వరం కేసుకు మినహాయింపునిస్తూ ఇటీవల రేవంత్‌రెడ్డి సర్కారు జీవో 104ను విడుదల చేసింది. పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత సీబీఐ విచారణకు అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ అందినప్పటికీదర్యాప్తు విషయంలో సీబీఐ అధికారికంగా ఎలాంటి జవాబు ఇవ్వలేదు. అయితే, సీబీఐ అధికారులు గురువారం ఈ కేసుకు సంబంధించిన సమాచారం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు లేఖ రాసినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించి జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ ఎన్‌డీఎస్ఏ , విజిలెన్స్ కమిషన్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలను తమకు పంపించాలని లేఖలో కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌డీఎస్ఏ బృందం 2023లో సంఘటన స్ధలాన్ని సందర్శించింది.
అదే ఏడాది నవంబర్‌లో ఒక నివేదిక, గత ఏడాది మేలో మరో నివేదిక, ఈ ఏడాది ఏప్రిల్‌లో మూడో నివేదికను ఎన్‌డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ తర్వాత విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలో దాదాపు 50 మంది పాత్రపై స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయి. పీసీ ఘోష్ నివేదికలోనూ ప్రాజెక్టు డిజైనింగ్ నుంచి నిధుల మంజూరు, కాంట్రాక్టుల్లో జరిగిన అవకతకవలను ప్రస్తావించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని నివేదికలు సీబీఐకి పంపించనున్నారు. విచారణ నివేదికల పత్రాలు అన్నీ అందిన తర్వాత సీబీఐ అధికారులు వాటిని పరిశీలిస్తారు. నేరాన్ని నిరూపించడానికి కావాల్సిన ప్రాథమిక సమాచారం నివేదికల్లో ఉందని భావిస్తే సీబీఐలోని న్యాయవిభాగం సలహా తీసుకుంటారు. వాళ్లు కూడా ఉందని చెబితే ప్రాథమిక విచారణ(పీఈ) ప్రారంభిస్తారు. కాళేశ్వరం కేసులో చాలామంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధుల పాత్ర ఉన్న నేపఽథ్యంలో కేసులు నమోదు చేయాలంటే కేంద్రం అనుమతులూ అవసరం అవుతాయి. ఐపీసీ సెక్షన్లతో పాటు అవినీతి నిరోధకచట్టం కింద సైతం దర్యాప్తు ప్రారంభించడానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతే సీబీఐ అధికారులు ముందుకు వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. దర్యాప్తు ప్రారంభించడానికి కావాల్సిన చట్టపరమైన, సాంకేతిక అనుమతులు అన్నీ వచ్చాకే సీబీఐ కేసు నమోదు చేయవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై దర్యాప్తు చేసే అధికారం సీబీఐకు ఉండదు. సెక్షన్ 5 కింద కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సీబీఐ దర్యాప్తుకు అనుమతి ఇస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 కింద ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ పోలీసు చట్టం ఆధారంగా పనిచేసే సీబీఐ అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే పూర్తి స్ధాయి పని ప్రారంభిస్తుంది. ప్రజా ప్రతినిధులుగా ఉన్న కేసీఆర్, హరీశ్‌రావుల పేర్లు కూడా ఇందులో ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుకు గవర్నర్ అనుమతిని సైతం సీబీఐ తీసుకోవాల్సి ఉంటుంది.