Share News

SI Flees on Seeing ACB: ఏసీబీని చూసి ఎస్‌ఐ పరార్‌

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:37 AM

సమస్య పరిష్కారం కోసం పోలీ్‌సస్టేషన్‌ మెట్లెక్కాలంటే భయపడతాం. కానీ, ఓ పోలీసు స్టేషన్‌ వద్దకు జనం భారీగా తరలి వచ్చారు. అంతటితో ఆగలేదు.....

SI Flees on Seeing ACB: ఏసీబీని చూసి ఎస్‌ఐ పరార్‌

  • వెంటబడి పట్టుకున్న ఏసీబీ అధికారులు

  • మెదక్‌ జిల్లా టేక్మాల్‌లో ఘటన

  • ఎస్‌ఐ అరెస్టుతో ఠాణా ముందే టపాసులతో స్థానికుల సంబురాలు

హైదరాబాద్‌/ టేక్మాల్‌/ అడ్డగుట్ట/ రాంగోపాల్‌పేట/ గోపాల్‌పేట, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సమస్య పరిష్కారం కోసం పోలీ్‌సస్టేషన్‌ మెట్లెక్కాలంటే భయపడతాం. కానీ, ఓ పోలీసు స్టేషన్‌ వద్దకు జనం భారీగా తరలి వచ్చారు. అంతటితో ఆగలేదు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే టపాసులు కాల్చి సంబురాలు కూడా చేసుకున్నారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రాజేశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడమే దీనికి కారణం. మెదక్‌ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపిన వివరాల మేరకు టేక్మాల్‌ మండలం అస్సద్‌ మహ్మద్‌ పల్లి తండా శివారులో ఈ నెల ఒకటో తేదీన వరికోత మిషన్‌ బ్యాటరీలు, గ్రీస్‌ మిషన్‌ దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితుడు టేక్మాల్‌ ఎస్‌ఐ రాజేశ్‌కు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తనిఖీ చేయడంతో ఆ గ్రామంలోని కొందరి వద్ద దొరికాయి. సదరు నిందితులను పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ రాజేశ్‌ విచారించడంతో వారు ఆ వస్తువులను సంబంధిత యజమానికి అప్పగించారు. కానీ, కొనసాగుతున్న కేసు రాజీ పరిష్కారం చూపుతానని.. అందుకు రూ.40 వేలు లంచం ఇవ్వాలని నిందితుల వద్ద ఎస్‌ఐ డిమాండ్‌ చేశాడు. వెంటనే వారు మధ్యవర్తికి ఫోన్‌పే ద్వారా రూ.10 వేలు చెల్లించినా.. మరునాటి నుంచే మిగతా సొమ్ము కోసం ఒత్తిడి తెస్తుండటంతో నిందితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు ఎస్‌ఐ రాజేశ్‌కు పోలీస్‌ స్టేషన్‌లోనే నిందితులు డబ్బులు ఇచ్చారు. అక్కడే మాటు వేసి, ఎస్‌ఐని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాము ఏసీబీ అధికారులమని చెప్పడంతో వారిని తోసివేసి పోలీ్‌సస్టేషన్‌ భవనంపైకెక్కి దూకిన ఎస్‌ఐ.. పొలాల్లోకి పరుగు తీశాడు. సుమారు 20 నిమిషాల పాటు వెంబడించిన ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకుని ఠాణాకు తీసుకొచ్చారు. టేక్మాల్‌ ఎస్‌ఐ రాజేశ్‌తోపాటు రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఒక విద్యుత్‌ ఏఈ, రెవెన్యూ సర్వేయర్‌, చైన్‌మన్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.


హోటల్‌ కూల్చేయకుండా 3 లక్షల ముడుపులకు సర్వేయర్‌ బెదిరింపులు

సికింద్రాబాద్‌ రెవెన్యూ మండల పరిధిలోని ఓ ప్రభుత్వ స్థలంలోని హోటల్‌ను కూల్చేయకుండా ఉండాలంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని దాని యజమానిని సర్వేయర్‌ కలువ కిరణ్‌కుమార్‌ బెదిరించాడు. అంత డబ్బు ఇవ్వగల శక్తి లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అతడికి వారు రూ.లక్ష నగదు ఇచ్చి పంపారు. మంగళవారం సికింద్రాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో చైన్‌మన్‌ మేకల భాస్కర్‌కు బాధితుడు రూ.లక్ష నగదు అందిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంగతి తెలిసిన సర్వేయర్‌ కిరణ్‌ కుమార్‌.. నిజామాబాద్‌కు పారిపోయేందుకు ప్రయత్నించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బోయిన్‌పల్లి బస్టా్‌పలో కిరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు సికింద్రాబాద్‌ తహసీల్దార్‌ ఆఫీసుకు తీసుకొచ్చారు. కిరణ్‌కుమార్‌తోపాటు భాస్కర్‌పై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ తెలిపారు.

Updated Date - Nov 19 , 2025 | 04:37 AM