Caste Based: జూబ్లీహిల్స్‌లో కుల సమీకరణం
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:18 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లకు ఎడాపెడా హామీలు, తాయిలాలు మాత్రమే ఇస్తే సరిపోదని..
వర్గాల వారీగా నేతలను రంగంలోకి దింపిన బీఆర్‌ఎస్
మైనారిటీ ఓట్లను మళ్లించడానికి కాంగ్రెస్ తీవ్ర కసరత్తు
కార్తిక భోజనాలకు పార్టీల ప్రణాళికలు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లకు ఎడాపెడా హామీలు, తాయిలాలు మాత్రమే ఇస్తే సరిపోదని.. సామాజికవర్గాల వారీగా కూడా సంతృప్తిపర్చాలని భావిస్తున్నాయి. కులాలకు పెద్దపీట వేసి, ఓటర్లకు గాలం వేయాలని చూస్తున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. కులాల వారీగా ఆకర్షించి, గంపగుత్తగా ఓట్లు వేయించుకోవడానికి శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు ఇప్పటికే కీలకమైన నేతలను రంగంలోకి దించాయి. బీజేపీ కూడా వివిధ సామాజిక వర్గాల ఓటర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికల వేళ కార్తిక మాసం కూడా రావడంతో కులాల వారీగా పసందైన విందులకు ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నాయి. ఓటర్లలో బీసీలు 1.34 లక్షల మంది ఉండగా, ముస్లింలు 1.20 లక్షల మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ ఓట్లు 22,746 ఉన్నాయి. ఎస్సీ ఓట్లు 28,350 ఉండగా.. అందులో మాదిగ 15,693; మాల 12657 ఓట్లు ఉన్నాయి. రెడ్డి 17,641, లంబాడీ 11364, క్రైస్తవులు 19,396 మంది ఓటర్లున్నారు. ఆయా ఓట్లను దక్కించుకోవడానికి పార్టీల నేతలు కుల పెద్దలతో చర్చిస్తున్నారు. తమ పార్టీల్లో ఉన్న ఆయా కులాల నేతలను ఇన్‌చార్జిలుగా నియమించి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.
గంపగుత్తగా ఓట్లు వేయించుకునేందుకు..
బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉన్న మాగంటి సునీత కమ్మ కులస్థురాలు కావడంతో ఆ సామాజికవర్గం ఓట్లు తమకు గంపగుత్తగా వస్తాయని బీఆర్‌ఎస్ భావిస్తోంది. పార్టీకి చెందిన కమ్మ నేతలు పువ్వాడ అజయ్, ఇతరులను రంగంలోకి దించి సమావేశాలు జరుపుతోంది. కమ్మ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే కాంగ్రెస్ అదే సామాజికవర్గానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించింది. నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తన సామాజికవర్గ ఓట్లన్నీ తనకే పడతాయనే ధీమాలో ఉండగా.. బీఆర్‌ఎస్ మాత్రం ఆ ఓట్లను గండికొట్టేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను రంగంలోకి దించింది. నవీన్‌యాదవ్‌కు బంధువైన తలసాని తన కులానికి చెందిన ఓట్లను ఏ మేరకు బీఆర్‌ఎస్‌కు పడేలా చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. బీజేపీ తరఫున లంకెల దీపక్‌రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆయా ఓట్లను దక్కించుకోవడానికి కిషన్‌రెడ్డి దృష్టి సారించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కూడా రెడ్డి ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే సీఎం రేవంత్‌రెడ్డికి ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో.. రెడ్ల ఓట్లు వన్‌సైడ్‌గా ఉంటాయా? లేక చీలిపోతాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తరహాలోనే బీఆర్‌ఎస్ పార్టీ కులాల వారీగా తమ నేతలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి సంప్రదింపులు జరుపుతోంది. కాంగ్రెస్ కూడా మూడు నెలల నుంచి ఇన్‌చార్జిలుగా ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌లతో పాటు 18 మంది కార్పొరేషన్ల చైర్మన్ల ద్వారా సామాజిక వర్గాల వారీగా పూర్తిస్థాయిలో వివరాలు సేకరించింది. ప్రస్తుతం కార్తిక మాసం కావడంతో కులాల వారీగా వన భోజనాలకు, సహపంక్తి భోజనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి కూడా ప్రధాన పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
మైనారిటీల ఓట్లపై దృష్టి
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 1.20 లక్షల మంది ముస్లింలే ఉండడంతో వారి ఓట్లను గంపగుత్తగా దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ తరఫున పోటీ చేసి 40 వేలకు పైగా ఓట్లను సాధించారు. ప్రస్తుతం మజ్లిస్ కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుండడంతో ముస్లిం ఓట్లన్నింటినీ దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గతంలో గెలిచిన మాగంటి గోపీనాథ్‌కు ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడేవి. ఆయన మరణించిన నేపథ్యంలో ఆ సానుభూతితో ఓట్లను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మజ్లిస్ నేతలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాజీ మంత్రి మహమూద్ అలీ, సోహెల్ తదితర నేతలను రంగంలోకి దించారు.