Share News

Vote Buying: ఓటుకు రూ. 3వేల దాకా

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:06 AM

పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు నోట్ల వాన కురుస్తోంది. అభ్యర్థుల మధ్య పోటీ పెరిగిన కొద్దీ పంపకాల జాతర కొనసాగుతోంది. తొలివిడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ....

Vote Buying: ఓటుకు రూ. 3వేల దాకా

  • కనీసం వెయ్యి.. తొలివిడత సర్పంచ్‌ ఎన్నికల్లో పోటాపోటీగా పంపకాలు

  • సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఓ గ్రామంలో ఓటుకు రూ.30 వేలు?

  • అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా మద్యం జోరు

  • బుధవారం సాయంత్రం నుంచే పంపిణీ

  • నేరుగా నగదు, లేకుంటే యూపీఐతో బదిలీ

  • ఇంటింటికీ ఖరీదైన మందు, మాంసం

  • చీరలు, లుంగీలు, కుక్కర్లతో ప్రలోభాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు ‘నోట్ల’ వాన కురుస్తోంది. అభ్యర్థుల మధ్య పోటీ పెరిగిన కొద్దీ పంపకాల జాతర కొనసాగుతోంది. తొలివిడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ఓటుకు కనీసం రూ.1000 నుంచి రూ.3వేలకుపైనే పలుకుతోంది! మేజర్‌ గ్రామ పంచాయతీలు, జనరల్‌ స్థానాలు, పోటీ ఎక్కువున్న చోట, రియల్టర్లు, వ్యాపారులు బరిలో ఉన్నచోట అంతకు మించీ దూసుకెళుతోంది. ఇక మద్యమైతే అసెంబ్లీ ఎన్నికలను కూడా మించి ఏరులై పారుతోంది. ఒక్కో ఓటరుకు క్వార్టర్‌ పంచడం పాతదైపోయి.. ఒక్కో ఫుల్‌ బాటిల్‌, అదీ కాస్త బ్రాండెడ్‌ కావాలన్న డిమాండ్‌ వరకు వెళ్లింది. తెల్లవారితే పోలింగ్‌ ఉండటంతో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో చాలాచోట్ల అభ్యర్థులు బుధవారమే అడిగినవన్నీ పంచేశారు. అనుచరులతో ఇంటింటికీ నగదుతోపాటు చికెన్‌, మందు పంపిణీ చేశారు.

ఓటుకు రూ.30 వేలు!

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు కీలక అభ్యర్థులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కావడం, పెద్ద నేతల అనుచరులు కావడంతో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీనితో పోటాపోటీగా ఓటుకు రూ.30 వేల వరకు కూడా పంచినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సమాచారమున్నా నేతల నుంచి ఒత్తిళ్లురావడంతో పోలీసులు ఏమీచేయలేకపోతున్నారని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజవర్గంలోని బండోనిగూడ, బుక్కోని గూడలో ఓటుకు రూ.10వేల వరకు, శంషాబాద్‌ మండలం పాల్మాకుల్‌, పెద్ద షాపూర్‌, నర్కూడల్‌ కూడా ఓటుకు రూ. 5 నుంచి 7వేల వరకు పంపిణీ చేసినట్టు స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొన్ని పంచాయతీల్లో ఓటు రేటు రూ.5వేలు దాటింది. ఓట్లు వేయించాలంటూ కుల పెద్దలు, కాలనీ పెద్దలకు అదనంగా రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఇవ్వడం కనిపించింది. మధిర మండలం వెంకటాపురం, చింతకాని మండలం బస్వాపురంలో ఓటుకు రూ.5వేలు పంచినట్టు స్థానికులు తెలిపారు. ఇదే మండలంలో పలు పంచాయతీల్లో ఓటర్లకు చీరలు, లుంగీలు, కుక్కర్లు పంపిణీ చేశారని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ఓట్ల కోసం నోట్ల కట్టలు తెగాయి. నల్లగొండ, మునుగోడు, సూర్యాపేట, తుంగతుర్తి, నకిరేకల్‌, ఆలేరు నియోజకవర్గాల పరిధిలోనూ ఈసారి పంచాయతీల్లో పంపకాలు బాగా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లాలోని పలు మేజర్‌ గ్రామ పంచాయతీలలో ఓట్ల కోసం యూత్‌ అసోసియేషన్లతో ఒప్పందం చేసుకుంటున్న సర్పంచ్‌ అభ్యర్థులు.. తాము గెలిస్తే వారిని గోవా టూర్‌కు తీసుకెళతామని హామీ ఇచ్చారు.


మా ఆయనకు ఓటేయొద్దు

భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ఓ గ్రామంలో ఒక వార్డు మెంబర్‌ అభ్యర్థి భార్య స్వయంగా ఇల్లిల్లూ తిరుగుతూ తన భర్తకు ఓటేయవద్దని చెబుతుండటం ఆశ్చర్యం కలిగించింది. ఈ వార్డు మెంబర్‌ అభ్యర్థి ఓ పార్టీ మద్దతుతో బరిలోకి దిగారు, వారి బంధువు మరో పార్టీ మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీనితో తమ వార్డులో ఓట్లు చీలకూడదని ఇలా చేశారని అంటున్నారు.

పెళ్లికి, ఇల్లుకు.. రూ.25,116!

వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం కోలుకుందలో సర్పంచ్‌ అభ్యర్థి కరణం కీర్తి రామకృష్ణ ఎన్నికల కోసం ఆరు గ్యారెంటీలతో మేనిఫెస్టో ఇచ్చారు. పెళ్లికి, ఇల్లుకు, పుట్టినరోజులు, ఫంక్షన్లకు ఆర్థిక సాయం అందిస్తానంటూ, అన్ని మతాల పండుగల సమయంలో చీరల పంపిణీ, భోజనాలు ఏర్పాటు చేస్తానంటూ బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు.

గ్రామంలో కార్మికులకు ఉచిత బీమా..

రంగారెడ్డి జిల్లా తక్కళ్లపల్లిలో సర్పంచ్‌ అభ్యర్థి పి.శ్రీశైలం వినూత్న హామీలతో బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు. గ్రామంలో కూలీలు, కార్మికులకు ఉచిత బీమా కల్పిస్తానని, ఆరు నెలలకోసారి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పను లు చేసి పెడతానని.. ఇలా 25 హామీలు ఇచ్చారు.

చెక్కు పట్టు.. ఓటేయకుంటే ఒట్టు!

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థి ఓటర్లకు రూ.10 వేలు సొమ్ము రాసిన చెక్కులు పంపిణీ చేశారు. డబ్బు, మద్యం పంచకుండా ప్రత్యర్థులు, పోలీసులు అడ్డుకోవడం వల్లే ఇలా ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. మరోవైపు అవి చెల్లని చెక్కులంటూ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు.


బీజేపీ, బీఆర్‌ఎస్‌.. పంచాయతీ దోస్తీ!

  • కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులకూ మద్దతు.. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ సిత్రాలు

పంచాయతీ ఎన్నికలు పేరుకు పార్టీల రహితమే అయినా.. చాలా చోట్ల అభ్యర్థులు తమ పార్టీ జెండాలు, రంగులతో ప్రచారం చేశారు. అయితే కొన్ని చోట్ల మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలవారు కూడా గ్రామాల్లో కలిసి పనిచేయడం, మద్దతు ఇచ్చుకోవడం కనిపించింది. హనుమకొండ జిల్లాలో పలుచోట్ల బీఆర్‌ఎస్‌, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీజేపీ నేతలు పెద్దగా పోటీ చేయడం లేదు. దానితో చాలా చోట్ల బీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. ప్రతిగా ఆయా గ్రామాల్లో కొన్ని వార్డుల్లో బీజేపీ మద్దతుదారులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోంది. షాద్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలో 24 గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులకు బీజేపీ నేతలు మద్దతు ఇస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఉప్పరిగూడలో కాంగ్రెస్‌ అభ్యర్ధికి బీజేపీ నేతలు మద్దతు ఇస్తున్నారు. పొల్కంపల్లిలో బీజేపీ అభ్యర్థికి బీఆర్‌ఎస్‌, మేడిపల్లిలో బీజేపీ నేతలు సీపీఎంకు, తులేకలాన్‌లో బీఆర్‌ఎ్‌సకు సీపీఎం నేతలు, కప్పాడులో బీఆర్‌ఎ్‌సకు బీజేపీ నేతలు మద్దతు ఇస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో పలుచోట్ల బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి అభ్యర్థులను రంగంలో దింపాయి. వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌, యాలాల్‌ మండలాల్లోనూ ఇదే పరిస్థితి. దోమలో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తుండగా.. ఒకరికి బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతు ఇస్తున్నారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని కొన్ని పంచాయతీల్లో సర్పంచ్‌ పదవుల కోసం బీఆర్‌ఎ్‌సకు బీజేపీ మద్దతు ఇస్తోంది. ఆ పంచాయతీల్లో ఒకటి, రెండు వార్డు స్థానాల్లో తమవారికి బీఆర్‌ఎస్‌ మద్దతు తీసుకుంటోంది. ఇక కాంగ్రెస్‌ రెబెల్స్‌ బరిలో ఉన్న చోట వారికి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బీజేపీ తక్కువ సర్పంచ్‌ స్థానాలకు పోటీ చేస్తోంది. కొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ మద్దతు తీసుకుని.. మిగతా చోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తోంది. అలాంటి చోట్ల ఉప సర్పంచ్‌ పదవులనూ పంచుకునే అవగాహన కుదుర్చుకుంటున్నాయి.

Updated Date - Dec 11 , 2025 | 07:03 AM