Share News

Cash Distribution: వందలో 80 మందికి నోటు!

ABN , Publish Date - Nov 11 , 2025 | 02:36 AM

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఓటర్లు డబ్బులో తడిసి ముద్దయ్యారు. శుక్రవారం జరుగుతున్న ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సోమవారం రాత్రి వరకు డబ్బును ఏరులై పారించాయి....

Cash Distribution: వందలో 80 మందికి నోటు!

  • జూబ్లీహిల్స్‌లో 80 శాతం మందిఓటర్లకు డబ్బు పంపిణీ

  • అందులో సగం మంది అయినా ఓటేస్తారని పార్టీల వ్యూహం

  • పక్కా ప్రణాళికతో ఓట్లు కొనుగోలు చేసిన రెండు ప్రధాన పార్టీలు

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఓటర్లు డబ్బులో తడిసి ముద్దయ్యారు. శుక్రవారం జరుగుతున్న ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సోమవారం రాత్రి వరకు డబ్బును ఏరులై పారించాయి. గతానికి భిన్నంగా ఇక్కడ మొత్తం ఓటర్లలో 80 శాతం మందికి డబ్బు ముట్టజెప్పాలన్న లక్ష్యంతో పంపిణీ చేసినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్‌ నియోజవర్గంలో 3.91 లక్షల మంది ఓటర్లుండగా... ఇందులో తప్పనిసరిగా 3.12 లక్షల మందికి డబ్బులు పంపిణీ చేయాలని ప్రధాన రాజకీయ పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందులో సగం మంది అయినా తమకు ఓట్లేస్తారని నేతలు ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే, 80 శాతం మందికి డబ్బులిచ్చినా... పోలింగ్‌ శాతం ఏ మేరకు నమోదవుతుంది? ఎవరికెన్ని ఓట్లు వస్తాయి? అనేది చర్చనీయాంశంగా మారింది. 2023 సాధారణ ఎన్నికల్లో 1,83,337 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లలో ఇది 47.58 శాతమే. 2018 ఎన్నికల్లో 1,54,948 ఓట్లు, 2014 ఎన్నికల్లో 1,65,368 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 50 శాతం ఓట్లు పోలవటం కూడా కష్టంగా మారింది. అయితే, ఇది ఉప ఎన్నిక కావటం, ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో పోలింగ్‌ శాతం అధికంగా నమోదవుతుందని భావిస్తున్నారు.

లెక్క ప్రకారమే..

ప్రధాన రాజకీయ పార్టీలకు డబ్బు పంపిణీ కూడా ప్రహసనంగా మారింది. ఉప ఎన్నికల షెడ్యూలు విడుదల కాగానే... ఓటర్ల వివరాల సేకరణ ప్రారంభించారు. ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు? ఉపాధికోసం ఎక్కడికి వెళ్లారు? అని ఆరాతీసి ‘ఓటరు మ్యాపింగ్‌’ పేరుతో సమగ్ర వివరాలు సేకరించారు. ఆ లెక్క ప్రకారమే డబ్బుల పంపిణీ చేశారు. అయితే, వారం, రెండు వారాల క్రితం జూబ్లీహిల్స్‌ పరిధిలో లేని ఓటర్లు... ఇప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. తమకు కూడా ఓటు ఉందని, డబ్బులివ్వాలంటూ పార్టీల నేతలను నిలదీస్తున్న ఉదంతాలు కనిపించాయి. రహమత్‌నగర్‌, ఎర్రగడ్డ, బోరబండ, యూసు్‌ఫగూడ, వెంగళరావునగర్‌, షేక్‌పేట్‌ డివిజన్లలో సోమవారం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులకు ఈ దృశ్యాలు కనిపించాయి.


డబ్బులివ్వని అభ్యర్థికే మా ఓటు..

రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీ కోసం టెంట్‌హౌస్‌ షాపులు, చిన్న దుకాణాలు, కిరాణా కొట్ల వంటి వాటిని ఉపయోగించుకున్నాయి. రాజీవ్‌నగర్‌లోని ఒక టెంట్‌హౌస్‌ వద్ద పంపిణీ కార్యక్రమానికి మహిళలు గుంపులుగా వచ్చారు. నేతలు తమ వద్ద ఉన్న జాబితాలో వారి పేర్లు సరిచూసుకుని నగదు, పోల్‌ చీటీలు ఇచ్చారు. రహమత్‌నగర్‌ ప్రాంతంలో ఒక పార్టీ నాయకులు అంగన్‌వాడీ కేంద్రం వద్ద బహిరంగంగానే నగదు పంపిణీ చేశారు. ఒక్కో ఓటరుకు రూ.2 వేల నగదు ఇచ్చారు. ఈ సందర్భంగా డబ్బు తీసుకున్న ఒక ఓటరును ... ఓటు ఎటు అని ప్రశ్నించగా... ‘రెండు పార్టీల అభ్యర్థుల తరఫున మాకు నగదు ఇచ్చారు. ఒకరు రూ. 2,500 ఇస్తే, మరొకరు రూ.1,000 ఇచ్చారు. నగదు తీసుకున్నందుకు ఇద్దరికీ ఓటు వేయలేం కదా? అందుకే డబ్బు ఇవ్వని మూడో వ్యక్తికి ఓటు వేస్తాం’ అని కరాఖండీ చెప్పటం విశేషం.

తటస్థంగా ఉంటే అన్ని పార్టీలు డబ్బులిస్తాయి..

బోరబండలోని పలు కాలనీలలో క్షేత్రస్థాయి పరిశీలనలో కొందరు ఓటర్లను వారి మనోగతం గురించి అడిగినప్పుడు చెప్పడానికి నిరాకరించారు. ‘మేము మా మనోగతం చెబితే ఒక్క పార్టీనే మాకు డబ్బులు పంచుతుంది. అదే తటస్థంగా ఉంటే అన్ని పార్టీల వారు డబ్బులు ఇస్తారు’ అని సమాధానమిచ్చారు.

డబ్బుకోసం పని మానుకుని ఇంటి దగ్గరే ఉన్న..

మరికొందరు ఓటర్లు ఎన్నికల్లో డబ్బులు తీసుకోవడం తమ హక్కు అన్నట్లుగా మాట్లాడారు. పైన నుంచి డబ్బులు పంచమని ఇస్తే.. సగం మందికి ఇచ్చి.. సగం మందికి ఇవ్వడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌కు చెందిన ఓ కార్యకర్త.. ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఏదైనా తేడా వస్తే నేరుగా రేవంత్‌ రెడ్డితోనే చెబుతాం.. దీనికి కారణం స్థానిక చోటా మోటా లీడరే.. ఒకరికిచ్చి, ఇంకొకరికి డబ్బు ఇవ్వకపోతే ఎలా?’ అని ప్రశ్నించాడు. మరో ఓటరును పలకరించగా.. ‘మా ఇంట్లో 5 ఓట్లున్నాయి. ఉదయం నుంచి ఎవరైనా డబ్బులు ఇస్తారేమోనని పని మానుకుని ఇంటిదగ్గరే ఉన్న.. కానీ ఏ పార్టీ సంప్రదించలేదు.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ 25 ఏళ్లుగా ఎన్నికలు చూస్తున్నాను.. ఇంత గుడ్డిగా డబ్బు పంపిణీ చేసిన ఎన్నికలు చూడలేదు’ అని వెంగళరావునగర్‌కు చెందిన ఒక ఓటరు పేర్కొన్నాడు.

జెండా ఒకరిది.. ఓటు మరొకరికి

కొన్ని చోట్ల చిత్రమైన పరిస్థితి కూడా ఎదురైంది. షేక్‌పేట్‌ డివిజన్‌లో ఒక రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొన్న కొందరిని మీరుఏ పార్టీకి ఓటేస్తారని అడగ్గా.. మా పార్టీ అభ్యర్థి గెలిచేది లేదు.. కాబట్టి ఇతర పార్టీలకు ఓటేస్తా అని చెప్పడం గమనార్హం. షేక్‌పేట్‌ డివిజన్‌లో కొంతమంది ఓటర్లు అభివృద్ధి కోసమే ఓటు వేస్తామని చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హయాంలో తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరిగాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అభివృద్ధి పనులు నిరాటంకంగా కొనసాగాలంటే అధికార పార్టీకే ఓటు వేయాల్సి వస్తుందని చెప్పారు.

Updated Date - Nov 11 , 2025 | 02:36 AM