Share News

Case Filed Against Naveen Yadav: నవీన్‌ యాదవ్‌పై కేసు

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:27 AM

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత వి.నవీన్‌ యాదవ్‌పై కేసు నమోదైంది. నియోజకవర్గంలోని ఓటర్లకు.. నవీన్‌ యాదవ్‌ ఓటరు గుర్తింపు కార్డులను...

Case Filed Against Naveen Yadav: నవీన్‌ యాదవ్‌పై కేసు

  • ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీపై.. రిటర్నింగ్‌ అధికారి ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌

  • సీఈవోను నివేదిక కోరిన ఈసీ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/యూసు్‌ఫగూడ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత వి.నవీన్‌ యాదవ్‌పై కేసు నమోదైంది. నియోజకవర్గంలోని ఓటర్లకు.. నవీన్‌ యాదవ్‌ ఓటరు గుర్తింపు కార్డులను అక్రమంగా పంపిణీ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి రజినీకాంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఫిర్యాదు చేయగా.. బీఎన్‌ఎ్‌స 170, 171, 174 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కూడా నవీన్‌ యాదవ్‌పై ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపి నివేదిక పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి నేతృత్వంలో పోలీసులు ప్రాథమిక విచారణ జరపగా.. నవీన్‌ యాదవ్‌ ఓటరు కార్డులను పంపిణీ చేసినట్లు తేలింది. దీని ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. పూర్తిస్థాయి విచారణ జరపాలని నిర్ణయించారు. ఆయన ఏ పద్ధతిలో ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకవేళ ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేస్తే.. సదరు ఓటరు అనుమతితో తీసుకున్నారా? లేదా? వంటి విషయాలపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. దీనిపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌కు సీఈవో కార్యాలయం నివేదిక పంపనున్నట్లు సమాచారం. అనంతరం ఆ నివేదికలోని అంశాల ఆధారంగా.. నవీన్‌ యాదవ్‌పై ఎటువంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ఈసీఐ మార్గదర్శకాలు జారీ చేస్తుందని, దాని ఆధారంగానే చర్యలు ఉంటాయని సీఈవో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. నవీన్‌ యాదవ్‌ మంగళవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని కలిసి వివరణ ఇచ్చినట్లు తెలిసింది.

ఓట్లు నమోదు చేయించిన నవీన్‌ యాదవ్‌

ఓటరు గుర్తింపు కార్డులు నవీన్‌ యాదవ్‌ చేతికి ఎలా వెళ్లాయన్నదానిపై పోలీసులు సమాచారం సేకరించారు. కొంతకాలంగా ఈ కార్డులను ఎంపిక చేసిన ఏజెన్సీ ముద్రిస్తుండగా.. తపాలా శాఖ ద్వారా ఓటర్ల చిరునామాకు పంపుతున్నారు. అయితే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ప్రాంతాల వారీగా అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు నవీన్‌ యాదవ్‌ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దరఖాస్తుదారుల పేరు, ఇతరత్రా వివరాలతోపాటు మొబైల్‌ నంబర్లు కూడా సేకరించారు. దీంతోనే ఫారం-6 ఆమోదం అనంతరం ఆన్‌లైన్‌లో ఈ-ఎపిక్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఓటరు మొబైల్‌కు వచ్చిన ఓటీపీని తీసుకుని ఈ-ఎపిక్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసినట్లు, ప్రింట్‌ చేయించి ఓటర్లకు పంపిణీ చేసినట్టు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఎన్నికల నిబంధనల్ని నవీన్‌యాదవ్‌ ఉల్లంఘించారా? లేదా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.

Updated Date - Oct 08 , 2025 | 04:27 AM