Suryapet District: వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కారు దూసుకెళ్లిన ఘటనలో కానిస్టేబుల్ మృతి
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:11 AM
వాహనాలను తనిఖీ చేస్తుండగా కారు దూసుకెళ్లిన ఘటనలో సూర్యాపేట జిల్లా నాగారం కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
పోలీస్ కుటుంబం ఓ సోదరుడిని కోల్పోయింది: ఎస్పీ నర్సింహ
నాగారం, సూర్యాపేట క్రైం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): వాహనాలను తనిఖీ చేస్తుండగా కారు దూసుకెళ్లిన ఘటనలో సూర్యాపేట జిల్లా నాగారం కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నాగారం మండలం నాగారం బంగ్లా గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ శీలం కమలాకర్ (34), ఏఆర్ కానిస్టేబుల్ పెరుమాళ్ల అశోక్ తీవ్రంగా గాయపడగా, ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ సునీల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కమలాకర్‌ను హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందినట్లు సీఐ నాగేశ్వరరావు తెలిపారు. కమలాకర్ స్వస్థలం కోదాడ మండలం గుడిబండ. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అశోక్, సునీల్‌లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సీఐ తెలిపారు. కారు ఆచూకీ కోసం అయిదు బృందాలతో గాలిస్తున్నట్లు చెప్పారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి చెందడం బాధాకరమని ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు. ఆదివారం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో కానిస్టేబుల్ కమలాకర్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.