Share News

Road Accident: వంతెనపై నుంచి లోయలో పడిన కారు

ABN , Publish Date - Dec 26 , 2025 | 06:02 AM

కారు అదుపు తప్పి వంతెన పై నుంచి లోయలో పడి నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Road Accident: వంతెనపై నుంచి లోయలో పడిన కారు

  • నలుగురి మృతి.. మరొకరి పరిస్థితి విషయం

  • మహారాష్ట్రలో ప్రమాదం.. మృతులు కాగజ్‌నగర్‌ వాసులు

కాగజ్‌నగర్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కారు అదుపు తప్పి వంతెన పై నుంచి లోయలో పడి నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన అఫ్జల్‌ బేగం, సహేరాబేగం, అసెరా షెబ్రీం, సల్మాబేగం, నజత్‌ బేగం, నస్రూత్‌ బేగం, అబ్దుల్‌ రహెమాన్‌ కలిసి కారులో బుధవారం ఉదయం నాగ్‌పూర్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాత్రి ఒంటి గంటకు లక్కడికోట-దేవాడ మధ్యలో వంతెన సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి లోయలో పడింది. కారు నడుపుతున్న అబ్దుల్‌ రహెమాన్‌ బయటకు వచ్చి కేకలు వేశాడు. దీంతో పక్కనే రోడ్డు పనులు కోసం నివాసం ఉంటున్న కూలీలు వచ్చి కారులో నుంచి అందరినీ బయటకు తీశారు. 20 ఫీట్ల ఎత్తున్న వంతెన నుంచి కారు పడిపోవడంతో అఫ్జల్‌ బేగం(52), సహేరాబేగం(45), అసెరా షెబ్రీం(13), సల్మాబేగం(39) అక్కడికకక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నజత్‌ బేగం, నుస్రత్‌ బేగంను చంద్రాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. వారి కాళ్లూ చేతులు విరిగాయని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతి చెందిన సల్మాబేగం, షబ్రీం తల్లీ కూతుళ్లు కాగా మిగతా వారు సమీప బంధువులు.

Updated Date - Dec 26 , 2025 | 06:02 AM