Road Accident: ఆగి ఉన్న కారును ఢీకొన్న బస్సు
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:45 AM
ఆగి ఉన్న కారును ఓ ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో అది దాని ముందు ఉన్న మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొని నుజ్జునుజ్జు అయింది...
రెండు బస్సుల మధ్య ఇరుక్కుని నుజ్జయిన కారు
చిట్యాల రూరల్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోత్రి): ఆగి ఉన్న కారును ఓ ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో అది దాని ముందు ఉన్న మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొని నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన జోష్‌కుమార్, విజయవాడకు చెందిన పైలా మురళి, మచిలీపట్నానికి చెందిన చల్ల శ్రీహర్షలు శనివారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున చిట్యాల శివారులోని ఓ పెట్రోల్ బంకు వద్ద రహదారిపై వాహనాలు నిదానంగా వెళుతున్నాయి. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక ఆగి ఉన్న వారి కారును హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆ కారు రెండు బస్సుల మధ్య ఇరుక్కుని నుజ్జునుజ్జయింది. వెంటనే ఇతర వాహనదారులు కారులో ఉన్న ముగ్గురిని బయటకు తీశారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం నార్కట్‌పల్లి శివారులోని కామినేని ఆసుపత్రికి తరలించారు.