Khammam Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:18 AM
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కురుస్తున్న వేళ మితిమీరిన వేగంతో....
మరో ఇద్దరి పరిస్థితి విషమం.. మృతుల్లో ఒకరు మైనర్
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సత్తుపల్లిరూరల్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కురుస్తున్న వేళ మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి తుక్కుతుక్కు అయింది. ఈ దెబ్బకు కారులో ఉన్న ఐదుగురిలో ఓ బాలుడి సహా ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లికి చెందిన జాయ్(18) మిత్రుడి గృహ ప్రవేశానికి వెళ్లివస్తానని తల్లిదండ్రుల వద్ద కారు తీసుకొని మంగళవారం రాత్రి 11 గంటలప్పుడు ఇంటి నుంచి బయలుదేరాడు. తమ ఇంటికి సమీపంలోనే నివసించే సమీప బంధువు శశివర్ధన్(11)తో కలిసి బయలుదేరిన జాయ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి వెళ్లి తమ మిత్రుడైన తలారి అజయ్‌ను కలుపుకొని చండ్రుగొండ మండలంలోని మహ్మద్‌నగర్ వెళ్లారు. అక్కడ సాజిద్ (22), ఇమ్రాన్ అనే మరో ఇద్దరిని ఎక్కించుకొని సత్తుపల్లికి బయలుదేరారు. అయితే, వారి కారు బుధవారం తెల్లవారుజామున కిష్టారం గ్రామంలోకి ప్రవేశించేటప్పుడు అంబేద్కర్‌నగర్ వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదసమయంలో సాజిద్ కారును నడుపుతుండగా.. జాయ్, శశివర్ధన్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మిగిలిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా.. సాజిద్ చికిత్స పొందుతూ మరణించాడు. అజయ్, ఇమ్రాన్‌ను ఖమ్మం తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగానికి తోడు మంచు వల్ల రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక, ప్రమాద విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు.