Vehicle Heater Accident: కారులో హీటర్ వేసుకోవడంతో చెలరేగిన మంటలు!
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:20 AM
తెల్లవారుజామున చలిగా ఉందని కారులో హీటర్ వేసుకోవడమే ప్రమాదాన్ని కొనితెచ్చింది. హఠాత్తుగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమవ్వగా..
నలుగురికి తప్పిన ప్రమాదం.. దగ్ధమైన కారు
కడ్తాల్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెల్లవారుజామున చలిగా ఉందని కారులో హీటర్ వేసుకోవడమే ప్రమాదాన్ని కొనితెచ్చింది. హఠాత్తుగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమవ్వగా.. డ్రైవర్ అప్రమత్తతో కారులోని వారు ప్రాణాలను దక్కించుకున్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గేట్ సమీపంలో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటాపూర్ తండా నుంచి నలుగురు యువకులు కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. చలిగా ఉండటంతో డ్రైవర్ కారులో హీటర్ వేశాడు. అయితే వెంకటాపూర్ తండా గేటు వద్ద ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై కారును ఆపి.. అందులోని వారిని లేపి దిగిపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కాగా, వారం రోజుల క్రితం ఓఆర్‌ఆర్‌పై కూడా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. కారులో హీటర్ వేసి డ్రైవర్ పడుకోవడంతో మంటలు చెలరేగి అతడు సజీవదహనమయ్యాడు.