Car Accident at Showroom: నిమ్మకాయలు తొక్కించి.. థార్‌ను షోరూం ఫస్ట్‌ఫ్లోర్ నుంచి దూకించి
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:16 AM
త్తకారు కొన్నానన్న మురిపెం ఆమెకు క్షణాల్లోనే భయానక అనుభవాన్ని మిగిల్చింది. షోరూం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న కారును నిమ్మకాయలు తొక్కించడం ద్వారా..
వాహనం కొన్న ఉత్సాహంలో యాక్సిలరేటర్ ఒక్కసారిగా తొక్కిన మహిళ
నేరుగా షోరూం మొదటి అంతస్తు నుంచి పేవ్‌మెంట్‌పై పల్టీకొట్టిన కారు... ఢిల్లీలో ఘటన
కారు లోపల ఆమె భర్త, షోరూం ఉద్యోగి.. బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన ముప్పు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: కొత్తకారు కొన్నానన్న మురిపెం ఆమెకు క్షణాల్లోనే భయానక అనుభవాన్ని మిగిల్చింది. షోరూం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న కారును నిమ్మకాయలు తొక్కించడం ద్వారా తానే తొలుత కదిలించాలని ఆమె ఉబలాటపడింది. డ్రైవింగ్ సీట్లో కూర్చుని, యాక్సిలరేటర్‌ను ఒక్కసారిగా తొక్కడంతో షోరూం అద్దాలను బద్దలు కొట్టుకుంటూ కారు ఫస్ట్‌ఫ్లోర్ నుంచి బయటకు దూసుకెళ్లి పల్టీకొట్టింది. ఢిల్లీలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు ఘాజియాబాద్‌కు చెందిన 29 ఏళ్ల మానీ పవార్. రూ.27 లక్షల విలువైన థార్ ఎస్‌యూవీ వాహనాన్ని తీసుకునేందుకు సోమవారం భర్త ప్రదీప్‌తో కలిసి ఆమె ఢిల్లీలోని మహీంద్రా షోరూంకు వెళ్లింది. వాహనపూజ చేశాకే షోరూం నుంచి ఎస్‌యూవీని బయటకు తీయాలనుకొని.. టైర్ల కింద నిమ్మకాయలను ఉంచింది. భర్తను వాహనంలో తన పక్కన కూర్చోబెట్టుకొని, తాను స్టీరింగ్ పట్టింది. షోరూం ఉద్యోగి వెనుక సీట్లో కూర్చున్నాడు. కారును స్టార్ చేసి, యాక్సిలరేటర్‌ను ఒక్కసారిగా తొక్కింది. వాహనం వేగంగా దూసుకెళ్లి.. ఫస్ట్‌ఫ్లోర్ నుంచి కింద షోరూం పేవ్‌మెంట్‌పై పడింది. బెలూన్లు తెరుచుకోవడంతో లోపల ఉన్న ముగ్గురికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు వెల్లడించారు. బాధితులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.