Share News

TS High Court: ఈ దశలో జోక్యం చేసుకోలేం

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:32 AM

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) విస్తరణకు మార్గం సుగమమైంది. డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున..

TS High Court: ఈ దశలో జోక్యం చేసుకోలేం

  • జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం

  • హైకోర్టు స్పష్టీకరణ

హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) విస్తరణకు మార్గం సుగమమైంది. డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున.. ఆ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. పునర్విభజనపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వరకు ఉన్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 300కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ పునర్విభజనకు కమిషనర్‌ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే, పునర్విభజన ప్రక్రియను సవాల్‌ చేయడంతోపాటుతమ అభ్యంతరాలను పరిష్కరించడంలేదని, వార్డులవారీగా జనాభా లెక్కలు, ధ్రువీకరించిన భౌగోళిక స్వరూపం ప్రజలకు అందుబాటులో ఉంచకుండా అభ్యంతరాలు ఎలా సమర్పించాలని ప్రశ్నిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. వార్డుల వారీగా జనాభా లెక్కలు, పటాలు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై మునిసిపల్‌ శాఖ, జీహెచ్‌ఎంసీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు చేశాయి. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కేవలం రెండు డివిజన్లకే పరిమితం చేస్తూ విస్తృత ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో తమ వార్డులకు చెందిన వివరాలు ఇవ్వాలని, తమ అభ్యంతరాలు సరిగా పరిష్కరించలేదని పేర్కొంటూ సోమవారం 80 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు జె.ప్రభాకర్‌, ఎల్‌.రవిచందర్‌ వాదించారు. ‘పునర్విభజన వంటి అంశాలపై సైతం న్యాయసమీక్ష చేయొచ్చని ఇటీవల సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం లేదా జీహెచ్‌ఎంసీ వంటి ప్రభుత్వ ఏజెన్సీలు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను హైకోర్టులో కాక ఎక్కడ ప్రశ్నించాలి. ఈ కోర్టు (సింగిల్‌జడ్జి) ఇచ్చిన తీర్పులో కేవలం రెండు పిటిషన్లలో మాత్రమే ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. మిగతా పిటిషన్లపై వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఇతర పిటిషన్లలో సింగిల్‌జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది. వార్డుల వారీగా జనాభా లెక్కలు, పటాలు అందుబాటులో ఉంచాలి’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ తరఫున ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. రాజ్యాగంలోని ఆర్టికల్‌ 243(జెడ్‌జీ) ప్రకారం పునర్విభజన ఎన్నికల ప్రక్రియ కిందకు వస్తుందన్నారు. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలుండదని పేర్కొన్నారు. 5వేల అభ్యంతరాలను చట్టప్రకారం పరిష్కరించామని, పునర్విభజన ప్రక్రియ ముగిసిందని.. ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం కోసం పంపామని స్పష్టం చేశారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తే మరిన్ని పిటిషన్లు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంలో ఇక జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేమని పేర్కొంటూ పిటిషనర్ల వాదనలను తిరస్కరించింది.


గ్రూప్‌-1 అప్పీళ్లపై విచారణ నేటికి వాయిదా

గ్రూప్‌-1పై టీజీపీఎస్సీ, విజయవంతమైన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై సోమవారం వాదనలు ప్రారంభమయ్యాయి. గ్రూప్‌-1 మెయిన్స్‌ సమాధాన పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలన్న సింగిల్‌జడ్జి తీర్పుపై డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఈ అప్పీళ్లు చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం ఎదుట తుది విచారణకు వచ్చాయి. టీజీపీఎస్సీ తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, అభ్యర్థుల తరఫున న్యాయవాదులు వాదించారు. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

Updated Date - Dec 23 , 2025 | 04:32 AM