Drug Cases: జైళ్లలో గంజాయి మత్తు
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:49 AM
గంజాయి కేసులో అరెస్టై ఆదిలాబాద్ జిల్లా జైల్లో విచారణ ఖైదీగా ఉన్న నిందితుడికి గంజాయి అందించేందుకు అతడి స్నేహితుడు జైలు గోడలపై నుంచి విసిరేశాడు.
చెప్పుల్లో దాచి, గోడపై నుంచి లోనికి విసిరేసి..ఇలా వివిధ మార్గాల్లో కారాగారాల్లోకి గంజాయి
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గంజాయి కేసులో అరెస్టై ఆదిలాబాద్ జిల్లా జైల్లో విచారణ ఖైదీగా ఉన్న నిందితుడికి గంజాయి అందించేందుకు అతడి స్నేహితుడు జైలు గోడలపై నుంచి విసిరేశాడు. మరో జైల్లో సినిమాల్లో తరహాలో ఓ నిందితుడు గంజాయి ప్యాకెట్లు మింగి జైలుకు వచ్చిన తర్వాత వాంతి చేసుకుని, బయటికి తీశాడు. జైలు అధికారులు అది గుర్తించి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆస్పత్రికి వచ్చిన ఖైదీకి చెప్పుల్లో గంజాయి దాచి ఇచ్చేందుకు అతడి స్నేహితులు ప్రయత్నించగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. అధికారులు ఎంత పకడ్బందీ నిఘా పెడుతున్నా ఎక్కడో ఓ చోట, ఎలాగోలా జైళ్లలోకి గంజాయి రవాణా అవుతోంది. గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలైన వారిలో కొందరు.. నిందితుడిగానో, శిక్షపడో జైలుకు వచ్చాక, అలవాటును మానుకోలేక జైల్లోకి గంజాయిని తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జైళ్లలో మత్తు పదార్థాల కట్టడి, వాటిని ఉపయోగించే వారిలో భయం నెలకొల్పడంలో భాగంలో స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాలను గుర్తించడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన శునకాలతో గత ఆరు నెలల్లో రెండు సార్లు ఆకస్మికంగా జైళ్లలో తనిఖీలు చేయడం గమనార్హం. ఈ తనిఖీల్లో మత్తు పదార్థాలు పట్టుబడకున్నా.. వాటిని తెప్పించుకునే యత్నంలో ఉన్న ఖైదీల్లో భయం నెలకొందని అధికారులు చెబుతున్నారు.