Candidates Win Panchayat Posts by Single Vote Margin: హమ్మయ్యాగెలిచేశాం
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:00 AM
రెండో విడత పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులు స్వల్ప తేడాతో విజయం సొంతం చేసుకున్నారు. నువ్వానేనా అన్నట్టు తీవ్ర ఉత్కంఠగా సాగిన కౌంటింగ్.....
ఒక్క ఓటు తేడాతో గెలిచిన పలువురు అభ్యర్థులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రెండో విడత పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులు స్వల్ప తేడాతో విజయం సొంతం చేసుకున్నారు. నువ్వానేనా అన్నట్టు తీవ్ర ఉత్కంఠగా సాగిన కౌంటింగ్, రీకౌంటింగ్ దాటి ఒక్క ఓటు తేడాతో గట్టెక్కి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం జలాల్‌పూర్‌లో కాంగ్రెస్ మద్దతులో బరిలో నిలిచిన చెన్నూరు నవనీత ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి నక్క బుచ్చిరెడ్డి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని రాజామన్‌సింగ్ తండాలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి గుగులోతు పటేల్‌నాయక్‌కు ఒక్క ఓటు తేడాతో గెలిచి సర్పంచ్ అయ్యారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కొంగర మల్లమ్మ ఒక్క ఓటు తేడాతో గెలిచి సర్పంచ్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గడ్డమీది తండా సర్పంచ్‌గా బాణావత్ సరోజ అనే స్వతంత్ర అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. అలాగే, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లిలో నందగిరి కనకలక్ష్మి (కాంగ్రెస్),పెద్దూరుపల్లిలో రామడుగు హరీష్ (కాంగ్రెస్) ఒక్క ఓటుతో గెలుపొందారు. శంకరపట్నం మండలం అంబాలాపూర్ వెంకటేష్ (కాంగ్రెస్) ఒక్క ఓటుతో గెలుపొందారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్‌లో కాంగ్రె్‌సకు చెందిన కోండ్ర తార కేవలం రెండు ఓట్లు తేడాతో ఎన్నికల్లో గెలుపొంది సర్పంచ్ అయ్యారు.
లాటరీలో వరించిన పదవి
వికారాబాద్ మండలం జైదుపల్లిలో ఓ అభ్యర్థి లాటరీ ద్వారా సర్పంచ్ పదవిని సొంతం చేసుకున్నారు. సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన జైదుపల్లి నాగిరెడ్డి, మౌనిక శ్రీకాంత్ రెడ్డికి చెరో 303 ఓట్లు రావడంతో అధికారులు టైగా ప్రకటించారు. అనంతరం ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం చిట్టిల ద్వారా లాటరీ తీయగా కాంగ్రెస్ అభ్యర్థి మౌనిక గెలుపొందారు.