kumaram bheem asifabad-అభ్యర్థులకు అవసరం.. పంచాయతీలకు ఆదాయం
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:36 PM
పంచాయతీల ఎన్నికల వేళ కొంత మేర గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరనుంది. సుమారు రెండేళ్లుగా పంచాయతీల్లో పాలక వర్గం లేక పోవడంతో ప్రభుత్వం నుంచి నిధులు రాక పనులు చేయలేని పరిస్థితి నెలకొన్నది. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థుల పేర ఏ విధమైన బకాయిలు ఉండకూడన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలతోనే ఇది సాధ్యమైంది. నామినేషన్ పత్రాలతో పాటు ఇంటి పన్ను, ఇతరాత్రా పన్నులనీ చెల్లించినట్లు పంచాయతీ కార్యదర్శి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం జత పర్చాల్సి ఉంటుంది.
- నామినేషన్ వేయాలన్నా, బలపరచాలన్నా నోడ్యూస్ తప్పనిసరి
- మొండి బకాయిలకూ కలగనున్న మోక్షం
ఆసిఫాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల ఎన్నికల వేళ కొంత మేర గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరనుంది. సుమారు రెండేళ్లుగా పంచాయతీల్లో పాలక వర్గం లేక పోవడంతో ప్రభుత్వం నుంచి నిధులు రాక పనులు చేయలేని పరిస్థితి నెలకొన్నది. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థుల పేర ఏ విధమైన బకాయిలు ఉండకూడన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలతోనే ఇది సాధ్యమైంది. నామినేషన్ పత్రాలతో పాటు ఇంటి పన్ను, ఇతరాత్రా పన్నులనీ చెల్లించినట్లు పంచాయతీ కార్యదర్శి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం జత పర్చాల్సి ఉంటుంది. లేదంటే.. సదరు నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరిస్తారు. ఈ విధంగా నిబంధనలు తప్పనిసరి అని చెబుతుండడంతో మొండి బకాయిలు సైతం వసూలవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల పుణ్యామా అని పల్లెల్లో ఏళ్ల తరబడి పేరుకు పోయిన బకాయిలు వసూలవుతు న్నాయి. ఇంటికి సంబందించిన పన్నులు చెల్లించాల ని గతంలో అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోలేదు. ఫలితంగా పంచాయతీలకు ఆదాయం లేక ఏ చిన్న పనిని చేయించలేక పోయారు. పాలక వర్గాల నేతలు పన్నుల రాబడిపై అంతగా దృష్టిని సారించలేక పోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకొంటుంది. నామినేషన్ వేయాలంటే సదరు అభ్యర్థి పంచాయతీకి ఎలాంటి బకాయిలు ఉండొద్దని ఎన్నికల కమీషన్ షరతును విధించింది. ఈ షరతే ప్రస్తుతం గ్రామాలకు ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది.
- ఏళ్ల తరబడి..
ఎన్నికల సమయంలో పంచాయతీలకు ఏళ్ల తరబడి పేరుకు పోయిన బకాయిలు వసూలువ ుతున్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పంచా యతీ, వార్డులకు పోటీ తీవ్రంగానే ఉంటోంది. ప్రస్తుతం పంచాయతీలకు నామినేషన్ దాఖలు చేయాలంటే ఇంటి పన్ను, ఇతర పన్నులకు విధిగా చెల్లించాలి. బకాయిలు చెల్లిస్తేనే నామినేషన్ వేయడానికి అర్హులవుతారు. లేకుంటే నామినేషన్‌ను తిరస్కరించనున్నారు. జిల్లాలో 335 పంచాయతీలు, 2874 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఒక్కో పంచాయతీకి కనీసం ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం ఉంది. తొలి విడత పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 425 మంది, వార్డులకు 1426 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన రెండు విడతల్లోనూ భారీ ఎత్తునే నామినేషన్లు వేయనున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఆరు నుంచి ఎనిమిది వేల మంది పోటీలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ పోటీలో ఉండే ప్రతీ అభ్యర్థి ముందుగానే ఇంటి పన్ను, ఇతర బకాయిలను చెల్లించాల్సిందే. వీటిని చెల్లించేందుకు ఆశావహులు అధికారుల వద్దకు వెళ్తున్నారు.
- ధ్రువీకరణ పత్రం ఉంటేనే..
గ్రామాల్లో ఇంటి పన్నులు చెల్లించినట్లయితే ఎలాంటి బకాయిలు లేవని ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత పంచాయతీ కార్యదర్శి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పత్రాన్ని జత పరిస్తేనే నామినేషన్ చెల్లుతుంది. లేకుంటే అధికారులు తిరస్కరిస్తారు. ఒక్కో అభ్యర్థి ఈ బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్కో ఇంటికి ఏడాదికి రూ.400 వరకు ఉంటుంది. పెద్ద ఇళ్లయితే గదికి రూ.150 చొప్పున ఎన్ని గదులు ఉంటే ఆ ఇం టికి అంత బకాయిని చెల్లించాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఇంటి, ఇతర పన్నులు ఏళ్ల తరబడి చెల్లించకుండా ఉంటుంటారు. కనీసం ఒక్కో అభ్యర్థి మూడు నాలుగు సంవత్సరాల బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి గ్రామం నుంచి అందే నిధులు బకాయిలు వసూళ్లు లక్షల్లోనే ఉం టుందని భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పంచాయతీలకు పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుండడంతో కొంత ఆర్థిక వెసులుబాటు కలగనుంది.
- అందరి బాధ్యతా నాయకులదే..
ఎన్నికల్లో పోటీ చేసే వార్డు సభ్యుల పన్నులను ప్రధాన నాయకులే ముందుండి మరీ చెల్లిస్తున్నా రు. కొన్ని గ్రామాలలో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థు లు మిగితా వార్డు సభ్యులకు చెందిన పన్నులు చెల్లిస్తున్నారు. అభ్యర్థులతో పాటు ప్రతిపాదించే వారు కూడా సంబంధిత గ్రామంలో అన్ని రకాల పన్నులు చెల్లించాల్సి ఉండడంతో పంచాయతీలకు భారీగా నిధులు సమకూరుతున్నాయి. గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు పన్నుల చెల్లించే వారి తో సందడిగా కనిపిస్తున్నాయి.